Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/810

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేమన కాలమందలి మతధర్మముల పరిస్థితి

భార్యాభర్తల కలహము, పుత్రుని నిష్ప్రయోజకత్వము, దారిద్య్రము మొదలగు సంసారమందలి పరిణామముల కంటె ఉక్కుమనసు గల వేమన్నను అరాజకము, అజ్ఞానము, స్వార్థపరత్వము, వంచన మొదలైన యన్యాయములతోఁ గూడిన సంఘస్థితి విశేషముగా కళవళ పెట్టినది. వేమన నాఁడు నాల్గు పురుషార్థములలో కామసాధనమైన అర్థము ముఖ్యమైనది. ప్రాచీనులకు మోక్షదృష్టి విశేషము. అట్టి మోక్షదృష్టి గల ధార్మికవర్గములో వేమన జన్మించినాఁడు. వేమన కెంతో పూర్వకాలమునందే మోక్షధర్మములు స్థిరపడినవి. ఏ జాతిలోఁ బుట్టినవారికి వారి పెద్దలు నిర్ణయించిన ధర్మమే ధర్మము. వారి దృష్టిలో నితరము లసత్యములు, నీచములు. ధర్మములు అసత్యములని భావించుటయే పాపము.

వేమననాటిఁకి ద్వైతము, అద్వైతము అనునవి రెండును వ్యాప్తిలోనున్న ప్రధానమత సిద్ధాంతములు. బహుదేవతావాదులైన జైనులు ఆంధ్రదేశము నే నాఁడో విడిచి వెళ్ళిరి. బౌద్ధులు భరతఖండమునుండియే వలసపోయిరి. కన్పింపనిదెల్ల మిథ్య యని నమ్మిన బుద్ధికుశలులగు చార్వాకులు సర్వమతములవారికి శత్రువులై నశించినారు. సృష్టిస్థితి లయములకు హేతువైన చేతనమూర్తి యొకఁడు తనను భక్తితో గొల్చినవారిని నిర్ద్వంద్వుల నొనర్చి తనకడ స్థిరముగా నుంచుకొనుననియు, నట్టి స్థితియే మోక్షమనియు పలుకు సగుణబ్రహ్మవాదులైన ద్వైతులందురు. చరాచర ప్రపంచ మంతయును మిథ్య యనియును, బ్రహ్మ సత్యమనియు, సర్వవస్తువులు మాయావృత బ్రహ్మమేయనియు, 'నేను బ్రహ్మనను జ్ఞానము నార్జించుటయే మోక్షమని అద్వైతు లందురు. నిర్గుణబ్రహ్మవాదులైన యీ యద్వైతులు మూర్తిని పూజించుట మొదలైనవి గలవారగుటచే, సిద్ధాంతమునం దద్వైతులనైనను వ్యవహారమున ద్వైతులు. సగుణోపాసకులకును, వీరికిని భేదము లేదు. ఈశ్వరుని గుణములను బట్టి ఉపాస్యదేవత లనేకు లేర్పడినారు. మతభేదము లేర్పడినవి. వానితో నాచారములు, మోసములు వచ్చిపడినవి. దంభము స్వభావమైనది. బ్రాహ్మణులు భూలోకదేవతలమనుకొనుట, జంగములు తాము సాక్షాత్తు జంగమ పరమశివుల మనుకొనుట, కావిబట్టలు గట్టిన సన్యాసులెల్లరు తమ్ము పూజింపవలయు ననుకొనుట జరిగినవి. ఇట్లు తత్త్వములు మతములుగా మారి అహంకారములను, అభిమానములను పెంపొందించినవి. రాజసభలలో మతవాగ్వివాదములు సహజమైనవి. బ్రాహ్మణ పండితుఁడు దేవళమునకుఁ బోయి తనకు మర్యాద జరుగనపుడు పూజారిని విడిచి, దేవునే బెదిరించు స్థితికి వచ్చినాఁడు. అయినను వేమన కాలమున నిజమైన విరాగులు,


810

వావిలాల సోమయాజులు సాహిత్యం-4