ధర్మపత్నిపై మార్చినాఁడు. “ఇంటియాలి విడిచి యెట్లుండ వచ్చురా?" యని చెప్పినాఁడు. "ఇంటియాలి విడిచి యిల జార కాంతల వెంటఁదిరుగువాఁడు వెట్టివాఁడు, పంట చేను విడిచి పరిగ లేరినయట్లు" అని ప్రబోధించినాఁడు. తుదకు భార్యను జేరిన యితఁడు ఆమెను గూడ సందేహించి "వరుఁడు చక్కనైన వజ్రాల గనియైన తళుకు మెఱపువంటి తత్త్వమున్న అన్యపురుషవాంఛ ఆడుదాని కుండు” నని నిశ్చయించినాఁడు.
భార్యకు స్వాతంత్రమీయక తొలినుండి స్వాధీన మందుంచుకొనవలెనని నిర్ణయించి, "మాటవినని యాలు మరగాలని, ఆమెను విడచి అడవిలో నుండుట మేలని, కాంతను కావలేనపుడు చావవలెనని" బోధించినాఁడు. వేమనకు ఇల్లు నరకప్రాయమైనదేమో, ఎదురు తిరిగిన భార్యను గూర్చి “ఇట్టి భార్యతోడ నెట్లు వేగింతురా?” అని దేవునితో మొఱపెట్టినాఁడు. మానశాలియగు నితఁడు భార్యను జంపి మరొకదానిని పెండ్లాడఁ దలపెట్టు రాక్షసత్వము లేనివాఁడు. స్వయం కృతాపరాధమును గమనించి, తన యదృష్టమునకు దీనుఁడైనాఁడు. అనుకూలవతి గాని భార్యవలన వేమనకుఁ గలిగిన సంతానము స్వేచ్ఛగాఁ బెరిగి, స్వేచ్ఛగా వర్తించి సంతాపమును గూర్చిరనుటకు, "ఎండిన మ్రానొక టడవిని” ఇత్యాది నిదర్శనము.
వేశ్యాప్రియత్వము వలన ఆస్తిపోయి వేమనకు పేదఱిక మబ్బినది. పూర్వము తన్నాశ్రయించినవారు నడపీనుఁగని ఎగతాళి చేసిరి. ఇంటిలో భార్యయును మెచ్చక చీకాకు పెట్టినది. వేమన్న విసిగినాఁడు. ధనము లేమి వలన పుత్రులు తప్పు లెన్నుదు రనియు, భార్య స్పృశింపదనియు, అది తనను, ప్రక్కవారిని కాల్చు దావానలమనియు ననినాఁడు. పనికిరాని తన పుత్రులను జూచి చింతించి, యోగ్యులైన కుమాళ్ళను గన్నవారిని గూర్చి "ధనము లేని పేదతండ్రి గర్భంబున భాగ్యపురుషుఁ డొకఁడు పరగఁబుట్టి" ఇత్యాదిగా చెప్పినాఁడు. నిరంకుశ ప్రభువులు, పాళయగాండ్రు మొదలగువారు ధనమునకై ఊళ్ళు కొల్లగొట్టించుట మొదలగువానిని జూచిన వేమనకు, ధనము స్వార్థమునకుఁ గాదనియు, గతి లేనివారిని రక్షించుటకనియును దోఁచినది. దేశాటనమున మలమల మాడువారి నెందఱినో చూచిన యితఁడు, చేతనైనంతవఱ కట్టివారిని రక్షించుట ధర్మముగ భావించి, అన్నదానమహత్త్వమును ప్రబోధించినాఁడు. ధనికులు కుక్షింభరులై, లోభులై దుర్వ్యయము లొనర్చుటను జూచి "పరదేశికి పట్టెడన్నము పెట్టలేని లంజెదాని కొడుకు లంజెల కిచ్చు" నని అసహ్యించుకొనినాఁడు.
808
వావిలాల సోమయాజులు సాహిత్యం-4