డిండిమ భట్టారకాది కవీంద్రులు లేకున్న శ్రీనాథుని కీర్తి మేఘములా నాఁటి యాంధ్రలోక విమానవీథుల విహరింప వీలెక్కడిది?
శత్రువును గూర్చి యంతరంగమునఁ దీవ్రవ్యథాప్రాచుర్యము వహింప నవసరము లేదు. అనుగుణమైన మానసిక ప్రబోధమొందిన శత్రుత్వ మే నాఁడును హృదయమునఁ బ్రవేశించి యతిఘోరదవానలముగఁ బరిణమించి పరశురామప్రీతి గావింపలేదు. మహాకవి శ్రీనాథుని మాట నమ్మిన కొందఱుండ వచ్చును. సుఖనిద్ర కలుగుట మానినదగుటచేఁ గంటికి నిదుర రాకపోయినను, మద్యపానము నిషేధితమగుట మధుకేళులు తప్పుటచేతను, బ్రమాదము లేదు. అయినను 'ఋణంకృత్వా ఘృతం పిబేత్' నేఁడు కాలలక్షణ మగుట వంటకము లిందకున్న నెట్లను భయముచే నట్టివారు శత్రువులతో సంధి గావించుకొన వచ్చును.
శత్రువును గూర్చిన యాలోచనామార్గమే ప్రాచ్యదేశముల విచిత్రగతి నడచినది. వారికి సపత్ను లని భారతీయులు నామకరణ మొనర్చినారు. వారు సవతుల వలె దుఃఖహేతువులఁట! బహుభార్యాత్వమును జట్టమూలమున నిషేధింప బద్ధకంకణమైన భారతదేశమున సపత్నులు సౌఖ్యహేతువులని వాదించువారును నుండరు. వాదించిన నంగీకరించువారును నుండరు. అయ్యుఁ బ్రపంచమున నేఁడును, సపత్నులు సౌఖ్య హేతువులని యంగీకరించు లలనాజనముగల జాతులు లేకపోలేదు. 'తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా! గంగవిడువు పార్వతి చాలున్' అని యడిగించుకొనుటకైన నంగీకరించినాఁడు కాని యా యాదిభిక్షువు శిరముపై నెక్కించుకొనిన గంగను దించుట కిష్టపడలేదు. గంగాగౌరుల కీర్తి యన్యోన్యము సపత్నులై యుండుటచే విశ్వవిఖ్యాత మైనదనుటలో విప్రతిపత్తి లేదు. అందువలన శత్రువులు సపత్ను లనుమాట యంగీకరింపవచ్చును కాని వారు దుఃఖహేతువు లని యొప్పుకొనుట వలను పడదు.
ప్రాచీనార్యరాజన్యులు 'శత్రురాయ వేశ్యాభుజంగ బిరుదాంకితులు.' ఈ భుజంగమత్వమును బరిపాటిగ సాగవలయునను గోర్కెతో నిరంతరమును రణ వీధివిహారమొనర్చినారు. వారి శిరముల ఖండించి బల్లెపుఁ గొనలకెత్తి యూరేగించి యుజ్జ్వల కీర్తిధ్వజములుగ వీరుపయోగించినారు తుదకు వారి కపాల పాళికలఁ దమ్మపడిగలఁబొదిగించి తృప్తిఁజెందినారు. రాజన్యులా శత్రువిజయములఁ దెల్పు కీర్తి స్తంభముల నాటించి శత్రువిచ్ఛేదనా కథల భావియుగ శుభ్రచరిత్రల కెక్కించినారు. వారి యాస్థానకవులలో నగ్రగణ్యులును నా పూర్వరాజన్యులకు 'శత్రుశోణితమున శాత్రవకామినీ చారునయన బాష్పసలిలముల నవనిఁదడుపఁడేని యా రాజు లావును,
80
వావిలాల సోమయాజులు సాహిత్యం-4