వేమన
శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ
'వేమన' కర్తలు మహావిద్వాంసులు, కవులు, గాయకులు, విమర్శకులు, పరిశోధకులు నై ఆంధ్రదేశము నందే కాక బహుప్రాంతములలోఁ గీర్తికెక్కిన మహనీయులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు. ఇది, క్రీ.శ. 1928లో వీరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారి యాజమాన్యమున వేమనను గూర్చి యిచ్చిన ఉపన్యాసవ్యాసముల సంపుటి. రాయలసీమలోని అనంతపురము మండల మందలి రాళ్లపల్లి శ్రీ శర్మగారి జన్మస్థానము. జననము 1893. శ్రీ శర్మగారు బహుకాలము మైసూరు విశ్వవిద్యాలయమున ఆంధ్ర పండితులుగా పనిచేసి, పిమ్మట తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్య విద్యాపరిశోధనాలయమున నుద్యోగించి, ప్రస్తుతము అచటనే విశ్రాంతులుగ నున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులై ప్రముఖపాత్ర వహించుచున్నారు. బహుభాషాకోవిదులైన వీరి యితర రచనలు తారాదేవి, మీరాబాయి, శాలివాహన గాథాసప్తశతి మొదలైనవి. వీరి సంగీత సాహిత్య విమర్శశక్తి అసామాన్యము. శ్రీ శర్మగారు అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన మొనర్చిన సంగీతకోవిదులు. సంగీతసాహిత్య విషయములపై రసికతా సౌకుమార్యములు, విజ్ఞతావిశాలదృక్పథములు ప్రదర్శించుచు, వీరు వ్రాసిన వ్యాసములు అనేకములు.
వేమన - కొన్ని విశేషములు
అతీంద్రియములైన తత్త్వములను దెలిసికొనవలెనను నాశ, అనుభవపూర్వకముగ వానిని సాధించు సాహసము, దానికి సాధనమైన రెండంచుల పదునుగల చురకత్తి వంటి కవిత్వశక్తి, దానికి మెఱుఁగిడు ప్రపంచవ్యవహారములలోని సూక్ష్మదృష్టి, తిట్టుచునే నవ్వించు హాస్యకౌశలము అనునవి ఆంధ్రులలో అపూర్వవ్యక్తియైన వేమన సహజగుణములు. ఇతని తత్త్వజ్ఞానము అనుభవపూర్వకము. ఇతఁడు సత్యమనినమ్మిన తన జ్ఞానమును ఇతరులకు బోధించుటలో కాలనష్టమని తలచినవాఁడు కాఁడు. ఇతఁడు నీవు చెడిపోవుచున్నావని తిట్టినవాఁడు గాని, నాకివ్వలేదని
సాహిత్య విమర్శ
795