Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/792

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాలెతతోఁ గూడి యెన్నియో పాపము లొనర్చుచు జీవించినాఁడు. ఒక్క దినమున దగ్గఱనున్న యరణ్యమధ్యమున రెండు వేటకుక్కలను గొని వేటపై నాసక్తితో మదించిన జంతువులను జంపి, కంటికి నచ్చిన నానా మాంసములు విశేషముగా గ్రహించి, కావడిలోఁ బెట్టుకొని సూర్యాస్తమయ సమయమునకుఁ దనయింటికి వచ్చెను. వచ్చునప్పటికి దైవయోగమున కోపించిన యముని దృష్టివలె భీకరమైన అగ్నిజ్వాలలో నాతని గృహము దగ్ధమై యుండెను. అందు కల్లు త్రాగుటచే మత్తుగొన్న అతనిచండాలభార్యయు, పుత్రులు కాలి నశించి యుండిరి.

తన యిల్లీ రీతిగ బిడ్డలు, పశువులు, భార్య, ధనము, మొదలగువానితో కాలిపోఁగా జూచి యాశ్చర్యపడి, దుఃఖించి "వినిందితకుల వ్యవహర్త యైన నిగమశర్మ కనురంధ్రములనుండి ముంతలతోఁ బోసినట్లు శీఘ్రముగ కన్నీటి ధారలను గ్రుమ్మరించినాఁడు. భూమి మీదఁ నెన్నియో పర్యాయములు చదికిలఁబడి, తలవ్రేల వేయుచు వికారముగ నున్న నోటినుండి లాలాజలములు తీగలు సాగగా, నతఁడు మిక్కుటమగు ప్రేమతో భార్యను గూర్చి యిట్లు విలపించినాడు : "అందరు నెల్లయెడల స్త్రీలను ధనములిచ్చి గ్రహింతురు. నేను పరమపవిత్రమైన వంశము నిచ్చి కొనినాను. ఓ ప్రియా! నల్లని నీ రూపము శాశ్వతమని నమ్మితిని. అది నిత్యమైనది కాక యిట్లు మెఱపు తీవవలె క్షణకాలము మెఱసి నశించునదని యెఱుఁగనైతిని. చిన్ని నల్లనిమచ్చలు గల స్తనములపై పయ్యెద కొంగు జాఱఁగా కిన్నెరవీణ మోపి, శ్రుతికిఁ దగినట్లు మెట్లను సవరించి నీవు గానమొనర్పఁగా, నీ తిన్నని కంఠధ్వని నా చెవులకుఁ దేనియ లొల్కుటను స్మరింతును. మచ్చ లేని చంద్రుని రూపమునఁ బ్రకాశించు నీ మోమున నమృత ముండుటచే నీ కడజాతి నాతికి బ్రాహ్మణుఁడు చిక్కినాఁడని నేను వచ్చి పోవునపుడు జనులు కోపమునఁ జూచుచు, ఉమ్మివేయుటనైన సహించినాను. లోకమున పుత్రు లెందఱికి లేరు? నా వంశము నుద్ధరించువారు, నీ పుత్రులను బోలినవారు పూర్వ మెవ్వరికి నెన్నఁడును బుట్టలేదు. వారి ముఖకాంతి, దేహపుష్టి, భుజవిజృంభణము, మాటల సొంపు, తామరరేకుల వంటి వారి కన్నుల చక్కదనము, చూచువారిని పరవశులను గావింపదా?" ఇట్లు భార్యను, పుత్రులను గూర్చి దుఃఖించి నిగమశర్మ, వారినిఁ జూచి కాని భుజింపను, నీరు ద్రావనని నిర్మానుష్యప్రదేశమున సంచరింపసాగెను. ముందు పుణ్యాత్ముఁడు కాఁబోవువాఁడు దుఃఖభారమును సహించు రీతిని కాఱడవియందు ఊగులాడుచు, తూలుచు, పొదలలో దూరుచు, ఊరకయే పోవుచుండెను.


792

వావిలాల సోమయాజులు సాహిత్యం-4