Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శత్రువులు - శత్రుత్వము


శత్రువులా! అయిన నేమి? ఇంత భయమేల? శత్రువు లనినను, శత్రుత్వ మనినను నింత భయపడ నగత్యమేమున్నది? సత్త్వచిత్తముతో నాలోచించిన శాత్రవు లన నంతగ భయ మొందఁ బనిలేదని నానిశ్చయము.

'శత్రువుల వలన నెన్ని ప్రయోజనము లున్నవి! పాశ్చాత్యవిజ్ఞానమునకు మూలపీఠమగు 138[1]ఫ్లూటార్కు మహాశయుఁడు శత్రువులఁ గూర్చియు శత్రుత్వమును గూర్చియు మేధాసుసంపన్నత నభివ్యక్త మొనర్పఁగల యొక సుందర జిజ్ఞాసను బ్రకటించినాఁడు. దానిని బఠింపుము. నీ విభ్రాంతి సమస్తమును నశించు'నని యొక యనుభవజ్ఞుఁడు సందర్భవశమున నాతోఁ బలికినాఁడు. నాఁటినుండి నాలో 'శాత్రవమథనము' జరిగినది.

లోకమునఁ బ్రతివ్యక్తియు శత్రువనిన జంకుచున్నాఁడు వలదన్నను మైత్రి నాశించుచున్నాఁడు. ఈ మార్గమునే కుటుంబములును, సంఘములు, దేశములు ననుసరించుచున్నవి. సర్వసామాన్యముగ శత్రువులు కావలయునని కోరుకొను వ్యక్తియును, కుటుంబమును, సంఘమును, దేశమును గన్పించుట లేదు. ఇందుకు భిన్నముగఁ బరిపంథు లేర్పడినఁ జతుర్విధోపాయముల జయించి 'జితశత్రుల' మని 'యజాతశత్రుల'మని 'సర్వలోక మిత్రుల'మని యును బ్రకటించుట ప్రస్ఫుటమగు చున్నది.


ఉ. "కంటికి నిద్ర వచ్చునె, సుఖంబగునే రతికేళి, జిహ్వకున్
      వంటక మిందునే, యితర వైభవముల్ పదివేలు మానసం
      బంటునె, మానుషంబు గలయట్టి మనుష్యున కెన్నఁ డేనియున్
      గంటకుఁడైన శాత్రవుఁ డొకండు దనంతటినాఁడు గల్గినన్”

అని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తపనీయనగదర్పోద్ధతిని సహింపక మాత్సర్యము వహించిన వింధ్యముచేఁ బల్కించినాఁడు. ఈ కావ్యమునం దా మహాకవి యాత్మీయత నిక్షేపితమై యున్నదని యెల్ల రంగీకరించినారు. మేరువు లేక వింధ్యకుఁ గీర్తి యెక్కడిది?

దేవరాయల యాస్థానమునఁ గనకాభిషేక సన్మానము నొందుటకుఁ గారణభూతులైన
  1. 138. ప్లూటార్కు - (క్రీ.శ. 48-122) గ్రీకు జీవిత చరిత్రకారుఁడు (Biographer) అతని 'Lives’ ప్రముఖ గ్రంథము

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

79