రామకృష్ణకవి - కవితావిశిష్టత
ఆంధ్ర సాహిత్య ప్రపంచమునందలి మిక్కిలి ప్రౌఢకవులలో రామకృష్ణుఁ డొకఁడు. కావుననే “ఆంధ్ర సారస్వతమున విశ్వామిత్ర సృష్టి యొనర్చినవారిలో నీతఁడొకఁడుగ బరిగణింపబడినాఁడు" ఇతనిని గూర్చి పాండురంగ మాహాత్మ్యకృతిపతి విరూరి వేదాద్రి మంత్రి “మహాంధ్ర కవితావిద్యాబలప్రౌఢి నీకెదురేరీ! సరసార్థ బోధ ఘటనా హేలా పరిష్కార! శారద నీ రూపము” అనియును, “సరస కవివి, నలుతెఱంగుల నెన్నఁగల కావ్యధారల ఘనుఁడవు. ఆశువునందు మేటివి. అఖిల కావ్య రస సుధామండనకుండలుఁడవు” మొదలుగ శ్లాఘించినాఁడు. ఆశ్వాసాంత గద్యము నందు రామకృష్ణుఁడే తన్ను “సరసకవితా సనాథుఁ" డని చెప్పుకొనినాఁడు. దీనియందు చాలసత్య మున్నది.
శ్రీకృష్ణరాయల కాలమున ఆంధ్ర సాహిత్యమునందొక నూతన పరిణామము కలిగినది. పూర్వయుగములందు వలె నీ కాలమున కవులు సంస్కృతపురాణములననువదింపక, వానినుండి కథలను గ్రహించి, మార్చి, పెంచి, చేర్చి రసవత్తరములైన ప్రబంధములను రచించినారు. ఈ ప్రబంధము లన్నియు నించుమించుగా శృంగారరస ప్రధానములై యున్నవి. “అష్టదిగ్గజము” లలో నొక్కఁడైన రామకృష్ణకవి స్వభావము పై కవితామార్గమునకు భిన్నమైనది. ఇతఁడు పలువురు పోయిన మార్గమునఁ బోవువాఁడు కాఁడు. నూతనమార్గమును ద్రొక్కి కీర్తి నార్జించుటయే ఘనమని తలంచి రామకృష్ణకవివర్యుఁడు పాండురంగ మాహాత్మ్యమును రచించినాఁడని యూహింపవచ్చును. అందుచే నీతఁడు శ్రీహరిచరిత్రమును ప్రబంధముగా రచింపఁదలచినవాఁడై, తీర్థ క్షేత్ర దైవతములు అను మూఁడును గల ప్రదేశపు మాహాత్మ్యమును, వస్తువును స్కాందమునుండి గ్రహించి, శాంతమున కంగరసములగు భక్తిభావాదులను చక్కగ వర్ణించుచు, నీ గ్రంథము నొక ప్రౌఢ ప్రబంధముగ “ఆంధ్ర పంచ కావ్యము" లలో నొకటిఁగ బరిగణింపబడునట్లుగను రచించినాఁడు. ఈ పాండురంగకృతి సర్వవిధముల విలక్షణమైనది. అంకితము విషయమునను రామకృష్ణకవి ఈ విలక్షణమును పాటించినాఁడు. పాండురంగ కృతిపతియైన విరూరి వేదాద్రి మంత్రి కృతికర్తకు (రామకృష్ణకవికి) అగ్రహారము లిచ్చు రాజుగాని, రెడ్డిగాని కాఁడు. ముక్తినిచ్చు దైవతమును గాఁడు. ఎక్కువగ నీయఁజాలనివాఁడు. పెదసంగ భూపాలునికడ వ్రాయసగాఁడు మాత్రము.
సాహిత్య విమర్శ
773