Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/770

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇతరవిద్యలు నేర్చినవాఁడు. ఇతని వృత్తము సామాన్యపాఠకుల కనుభవమునకు వచ్చునదై యున్నది. ప్రబంధ కథానాయకుల ధీరోదాత్తాదిగుణములు సామాన్యుల కనుభూతికి వచ్చునవి కావు. రామకృష్ణకవి సామాన్యపాత్రయైన నిగమశర్మ మూలమున సంఘమందలి కొంత మాత్రమైనను పాఠకుల కనుభూతికి సరిపోవునట్లుగ సామర్థ్యముతో వర్ణించి చూపినాఁడు. నిగమశర్మవలె అంగమర్దనము మొదలగు వానిని గావించుకొని పులుగడిగిన ముత్తెమువలె నొప్పుచు నఖక్షత, దంతక్షతములతో సఖులను, పరిహాసకులను వెంటనిడుకొని తిరుగువారు సంఘమున నెల్లవేళల నుందురు. అట్టివారు వ్యసనములకు లోనై యింటనున్న సొమ్మునంతటిని వ్యర్థమొనర్చి, పిదప శరీరము మీఁది సొమ్ములను కుదువఁబెట్టుట, తల్లి సొమ్ములను మెల్లగ దొంగిలించుట, తండ్రికి వ్రాసి ఇచ్చిన పత్రములను పోయినంత కమ్ముట, మితిమీరిన వడ్డీకి పత్రములు వ్రాయుట, అమ్ముట మొదలగున వన్నియును నేఁడు సంఘమున కన్పట్టుచున్నవి. నిగమశర్మ వంటివారు నేఁడును సంఘమున నుండి అప్పులు మితిమీరినంత తిండికి, గుడ్డకు లేక యూరు విడిచి తిరుగుట, నీచులను వానికై వేడుట నొనర్చుచునే యుందురు. రామకృష్ణకవి నిగమశర్మ వృత్తమున సరసముగ సాంఘికవృత్తమును, స్మృతికిఁ దెచ్చినాఁడు.

నిగమశర్మ యక్కవంటివారు నేఁడును సంఘమున కన్పట్టుచుందురు. దుర్వ్యసనియైన తమ్ముని మూలముగా పుట్టిల్లు గుల్లయై పోవుచుండ సహింపలేక, చక్కదిద్ద యత్నించు జ్యేష్ఠ సోదరీమణులు నేఁడు నెందరో యున్నారు. అక్క చెప్పిన బుద్ధులను ఒక ప్రయోజనము సాధించుటకై విన్నట్లు విని కొంతకాలము “తేనె పూసిన కత్తివలె వర్తించి" తుద కర్ధరాత్రమున నిగమశర్మ వంటివారు నేఁడు సర్వధన మెత్తుకొని పోవుచుందురు. రామకృష్ణకవి యొక వంక సంఘవృత్తమును స్మరింపఁజేయుచు, నిగమశర్మ మూలమున చక్కని నీతిని సహితము బోధించినాఁడు.

రామకృష్ణకవి నిగమశర్మోపాఖ్యానమున శ్రోత్రియసంసారమును వర్ణించుటయే కాక, జానపదులైన పామరజనుల సంసారమర్మములను సైతము చక్కగ నెఱిగి వర్ణించి, తన సాంఘికవృత్తానుభవమును వెల్లడించినాఁడు. నిగమశర్మను ప్రాణాపాయస్థితి నుండి బయటఁ బడవైచి రక్షించి యింటనుంచుకొని గురునిగ, దైవముగఁ బోషించిన కాఁపు సామాన్యుఁడు కాఁడు. జానపదాగ్రగామియగు నాతనియింట నున్న వికారపుఁ గోడలి వంటి కోడలు ఈ నాఁడును గౌరవమర్యాదలు గల కుటుంబములలోఁ


770

వావిలాల సోమయాజులు సాహిత్యం-4