ఉత్తమ నాటకములను పరిషత్తువారు పోటీపరీక్షలను పెట్టి సంపాదింప దలచుటను గూర్చి శ్రీ పింగళి చెప్పినదెల్ల సత్యము. వారన్నట్లు పేరును పణము పెట్టి జూదమాడవలసి వచ్చుటచే, ఉత్తమ రచయితలు పోటీలో పాల్గొనరు. నచ్చిన కవిని పిలిచి గౌరవించి, సంప్రదించి ఆయనచే నాటకమును వ్రాయించుకొనుటయే కర్తవ్యము. ఈ అభిప్రాయమును స్వీకరింపక పోవుటవలన నాటకకళాపరిషత్తు మంచి నాటక మొకటైనను వ్రాయించలేకపోయినది. నాటకము దృశ్యము, శ్రవ్యము రెండును కావలె. కావ్యగౌరవము లేక కేవల ప్రయోగానుకూల్యముగల నాటకము ఉత్తమ నాటకము కాఁజాలదు. సాహితీగుణములను లోపింపఁజేసి ప్రయోగార్హత మాత్రమే యుండునట్లు నాటకమును వ్రాయమని కోరినచో, కవి శబ్దవాచ్యుఁ డెవ్వఁడు నట్టిపని యొనర్పఁడని శ్రీ పింగళి చెప్పిన వాక్యము లెంతయు సత్యము. నేటి నటకులు కేవల ప్రయోగానుకూల్యము గల నాటకములనే వ్రాయుఁడని కోరుటతో, ఉత్తమశ్రేణి కవులెవరును రూపకరచన యొనర్పలేదు. సాంఘికేతివృత్తమును గూర్చి శ్రీ పింగళి చెప్పిన అభిప్రాయములును సత్యములు. నూతనవస్తువును గ్రహించునపుడు ప్రచారనాటకములను వ్రాయింపరాదని, అవి ఆ కార్యము కడముట్టిన వెనుక విస్మృతములగునని శ్రీ పింగళి తెల్పినారు. ఈ భావములు అనుభవమున సత్యములని నిరూపితములైనవి. అదియును గాక ఈ నాఁడు సంఘమున నే వర్గమువారి నేమియన వీలు లేకుండుట వలనను, కవి యొనర్చిన విమర్శ వ్యక్తులకు సంబంధించినదిగా ప్రేక్షకులు గ్రహింపలేకపోవుట వలనను సాంఘికేతివృత్తములతో నాటకములు మంచివి పుట్టుట లేదు. పద్యపఠనమును గూర్చి వ్యతిరేకభావముండుట, సంప్రదాయ మెఱుగకపోవుట, కేవల పాశ్చాత్య గద్యనాటకమున కొనర్చు నంధానుకరణము. ఈ విషయమున శ్రీ పింగళి "ఏ రసమునకు నే పద్యమునకు నే రాగమెంతవరకు తగునో తెలిసికొని నటుడు పాడుట జరుగవలెను గాని పద్యములనే తుడిచివేయుట వాంఛనీయమైన సంస్కారము కాదు” అని సెలవిచ్చినది సత్యము. ఈ భావమును త్రోసిపుచ్చుట వలననే నాటక పరిణామమున మూఁడు నాలుగు దశలలో నున్నట్లుగ పద్యమును భావయుక్తముగ పాడగల నటులు కరవైనారు. పద్యపఠనమునకు అవసరమైన పరిశ్రమయే సన్నగిల్లినది. నటులకు గాత్రశిక్షణ (Voicce - Culture) అవసరమన్న శ్రీవారి అభిప్రాయము ఉచితమైనది. పద్యమును గాని, వచనమును గాని రక్తికట్టునట్లనుటకు ఈ గాత్రశిక్షణ అత్యవసరము. పాశ్చాత్య నటనటీమణు లీ విషయమున నధికశ్రద్ధ వహించెదరు. నాట్యశాస్త్ర పరిచయము నటకులకు, నాటక ప్రయోక్తలకు నవసరమన్న శ్రీ పింగళి అభిప్రాయమును ఉచితమైనది. కృషి
762
వావిలాల సోమయాజులు సాహిత్యం-4