కృతజ్ఞతాబుద్ధితో నట్టి భావములకు మూలపురుషులను స్మరించుట (శ్రీనాథుని గూర్చి చిలుకూరి; తిక్కన పోతనలను గూర్చి ఉన్నవ ప్రసంగవశమున నన్న అభిప్రాయములను వారివిగనే ప్రదర్శించుట యిందు కుదాహరణము) వీరి రచనాస్వచ్ఛతకు నిదర్శనము. వీరి భాష నిబిడమైనది. వ్యర్థపదవిరహితము, అల్పాక్షరములలో అనల్పార్థము గలది. వస్తువు జిజ్ఞాసాపూర్వకమైనది, నిశితభావ స్ఫోరకమైనది, తారతమ్య నిరూపణాత్మక మైనది. పఠితలకు రచన కొలదియైనను మరింతగ నంతయు నీయగల్గినది.
అధ్యక్షోపన్యాస విమర్శ
అధ్యక్షోపన్యాసమున నటనానుభవము పుష్కలముగ నున్న శ్రీ పింగళి వెల్లడించిన భావములు సమంజసములు, సత్యనిరూపకములు. నృత్త, నృత్య, నాట్య విభేదములను కనులకు గట్టినట్లు వీరొనర్చిన నిరూపణము, మార్గ - దేశి నాటకములను గూర్చి చేసిన ప్రసంగము వీరి నిశితావగాహనశక్తికి, చరిత్రాత్మకదృష్టికి తార్కాణములు. స్త్రీలే స్త్రీపాత్రధారణ మొనర్పవలెనన్న సిద్దాంతము సమంజసము కాదని, వీరు 'రూపానురూపనాట్యము' వంకకు మొగ్గుచు, పాత్రధారణకు రేఖభావనను ప్రధానమనుట వీరి భావుకతకు, విజ్ఞతకు నిదర్శనములు. స్త్రీలే స్త్రీ పాత్రలు వేయవలెనన్న సిద్ధాంతము తుదముట్టదన్న వీరి వాక్కు వీరి దూరదృష్టిని వెల్లడించుచున్నది. వీరన్నట్లు ఇది తుదముట్టదని ఈ నాటికే నిరూపితమైనది. స్థానం, జగ్గరాజులను మించు నటీమణులు రంగస్థలమున ప్రవేశింపలేదు. రాజేశ్వరి, పూర్ణిమ, అనసూయలవంటి నటీమణులు కొందరు రంగస్థలమున ప్రవేశించి ప్రతిభను ప్రదర్శించినను, వారిలో సహజ స్త్రీత్వమూలకమైన ప్రదర్శనమేగాని, కళాత్మకమైన (రూపానురూప నాట్యాత్మకమైన) కళ కన్పట్టదని విమర్శకులనుచున్నారు. ఈ సిద్ధాంతము మూలముగా పురుషులు తొలినాటివలె స్త్రీ వేషధారణకు పూను కొనలేకపోవుట, స్త్రీలు విరివిగ రంగస్థలమున ప్రకాశింపకపోవుట, తన్మూలముగ (స్త్రీ వేషధారణము) నాటకప్రదర్శనలు మందగించుట జరుగుచున్నవి. పత్రికలు స్త్రీల రంగప్రవేశార్హత గృహస్థజీవితమునకు దెబ్బకాదని ఎన్ని వ్యాసములు వ్రాయించినను, అవి గృహస్థజీవితమునకు దెబ్బతీయుచునే యున్నట్లు అనుభవము వలన తెలియుచున్నది.అందుచే ఉన్నతవర్గములలోని స్త్రీలు రంగస్థల ప్రవేశ మొనర్చుట లేదు. కావున శ్రీ పింగళి సూచించినట్లు పురుషులు కూడా స్త్రీ పాత్రధారణ యొనర్చుట కళ కొఱకును, ప్రదర్శనబాహుళ్యము కొఱకును నత్యవసరమని తోచుచున్నది.
సాహిత్య విమర్శ
761