Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/760

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నొనర్చిన విమర్శ సమన్వయదృష్టికి నిదర్శనములు. శ్రీ పింగళి గొప్ప భావనాబలమ గలవారు. ఒక్క యుగకర్త కాలమును, సాంఘికాది పరిస్థితులను సమ్యగ్భావనాబలముచే నూహించి, కవితలో దానిని సమన్వయ మొనర్చుటలో వీరు అనన్యులు. కవిబ్రహ్మ తిక్కన భారతప్రశస్తిని నిరూపించువేళ తమ శక్తిని బహుళముగ ప్రదర్శించినారు. సాహిత్య కళానిర్మితికి శబ్దార్థములు రెండును సాధనములు. వీనిలో వీరికి శబ్దము కంటె నర్థముపై ప్రీతి యధికము. కవితాశిల్పము కంటె కొంత విజ్ఞానాధాయకత్వముపై నభిమాన మతిశయముగా నున్నట్లు గోచరించును. వీరి విమర్శలలో ఒక జాతి రసికుల దృష్టిలో నన్నయ, నాచన సోమన, శ్రీకృష్ణరాయాది మహాకవులు దెబ్బతిన్నారన్న భావమున్నది. దీనికి రుచియందలి భిన్నతయే గాని పక్షపాతాదికము కారణము కాదని తోచుచున్నది. అట్లని వీరు కేవల విజ్ఞానాధాయకత్వమును కళగా నుద్దేశింపరు. అధ్యక్షోపన్యాసమున సాంఘికనాటకములను గూర్చి చెప్పుచు, నీ విషయమును స్పష్టముగ వెల్లడించినారు. విజ్ఞానమిచ్చుట అను పనిని సినిమాలకు, పత్రికలకు నితరరీతి రచనలకు విడిచిపెట్టవలెనని వీరి మతము.

రజోగుణవిజృంభణము నడుపులో పెట్టగల సత్త్వప్రాధాన్యమును, వీరు కవులందు ప్రధానముగ నాసింతురు. నాటకీయతటస్థత (Dramatic Objectivity) తో పాత్రసృష్టి యొనర్పగల తిక్కన, పెద్దనాదులపై వీరికి ప్రీతి. కేవల వర్ణనప్రతిభ నిర్వేలముగ బ్రదర్శించుట వీరికి విశేషముగ గిట్టదు. వర్ణనప్రధానములైన ప్రబంధము లందును వీరు కథానిర్మాణము (Structure of the Plot), పాత్ర సంభాషణవిరచన సామర్థ్యము, శయ్యాసమతల వెదకెదరు. వీరికి శబ్దాలంకారములపై దృష్టి తక్కువ. భావన కిచ్చినంతటి గౌరవమును వీరు దాని ఆభాసరూపమైన ఊహ (Fancy) కు ఇవ్వరు. ఇది ఎంతయు నుచితమైన మర్యాద. వీరి విమర్శలందు వెదకినచో ఉత్తమ సాహిత్యవిమర్శకుఁడు సాహిత్యమున గమనింపవలసిన సార్వజనీనత, సార్వకాలీనత, మనోధర్మ నిరూపణము, పాత్రసృష్టి, సత్యప్రాధాన్యము ఇత్యాదులైన, ముఖ్యగుణ విశేషనిరూపణము గోచరించును. ఇట్టి ఉత్తమజిజ్ఞాసతో సాహిత్యవిమర్శ, వాఙ్మయచరిత్ర రచన మన ఆంధ్ర సాహిత్యమున నెలకొల్పినవారు శ్రీ పింగళి. కావుననే వీరిని 'ఆంధ్ర విమర్శ స్థాపనాచార్యులు' అనుట సమంజసము. నేటి విమర్శయంతయును వీరిచ్చిన గీటురాళ్ళతోనే (Touch-stones) సాగుచుండుట వీరీబిరుదమున కెంతయు తగినవారని నిరూపించుచున్నది.

నేటి వాఙ్మయచరిత్రకారులలోను, విమర్శకులలోను అన్యుల భావములను, అభిప్రాయములను స్వకీయముగా చెప్పికొనుట ఒక ఆచారమైనది. శ్రీ పింగళి


760

వావిలాల సోమయాజులు సాహిత్యం-4