ప్రబంధ యుగకర్త”, “ప్రబంధయుగ నాందీ ప్రవర్తకుఁడు”, “ఆంధ్ర కవితారథమును ప్రబంధమార్గము”నకుఁ ద్రిప్పినవాఁడు, “చిన్నారి పొన్నారి చిఱుతకూకటి నాఁటి” నుండియు, సహస్రమాసజీవియై “దివిజ కవివరులగుండియల్ దిగ్గురనగ నమరపురి కేఁగు” నంతవఱకును అమృతభాండములవంటి అమర కావ్యములు నాంధ్రజాతికిఁ బ్రసాదించిన చిరస్మరణీయుఁడైన మహాకవి శేఖరుఁడు శ్రీనాథుఁడు. భట్టుమూర్తి కొనియాడినట్లుగ నీ మహాకవి "బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమును బ్రోచిన" వాఁడు.
ప్రబంధనామముతో వెల్వడిన గ్రంథముల నన్నిటిని పరిశీలించి చూడఁగా అది అష్టాదశ వర్ణనాత్మకమై, ఏకనాయకాశ్రయమై, వస్వైక్యమును (Unity of Subject Matter) గల్గి, శృంగారరసము ప్రధానముగను, అన్యరసములు గౌణములుగను నొప్పుచు, అలంకారికరచనను జీవముగాఁగల్గి యొక స్వతంత్రకావ్యమై యొప్పునని వ్యక్తమగుచున్నది. ప్రబంధపూర్వయుగ ప్రవర్తకుఁడైన శ్రీనాథ కవిసార్వభౌముఁడు దరిదాపుగ నీ లక్షణములన్నియును దన “సుకుమార చరిత్ర" మను నామాంతరముగల శివరాత్రి మాహాత్మ్యమునందుఁ గన్పట్టునట్లుగ కావ్యరచన మొనర్చినాఁడు. ప్రబంధ లక్షణమగు వర్ణనప్రాధాన్యమును జూపఁ దలపెట్టఁదలచినవాఁడు గావుననే కృత్యాది యందు "అష్టాదశ వర్ణనాగర్భంబుగా సత్యాశ్చర్యకరంబై యుండ నా రచింపబూనిన కథావిధానంబు” అని చెప్పియున్నాఁడు.
శ్రీనాథుఁడు ఎంతటి ఉద్దండపండితుఁడో అంతటి కవివర్యుఁడు. సర్వ పురాణములతో పరిచయము గల యీతఁడు, శివరాత్రి మాహాత్మ్యము కథావస్తువును స్కాంద పురాణాంతర్గతమైన ఈశాన సంహితనుండి స్వీకరించి, రసవంతమైన కావ్యధోరణితో నీ కావ్యమును జెప్పియున్నాఁడు. ఈశానసంహితయందలి 336 శ్లోకములు దీనికాధారము. శివరాత్రి మాహాత్మ్యమందలి కథ శ్రీనాథుని యితర కావ్యములైన భీమఖండ, కాశీఖండములలోని కథల సంపుటులవలెఁ గాక, అధికమగు వస్వైక్యముగల యొకే కథయై యున్నది. శృంగారరసప్రియుఁడును, శివభక్తి తత్పరుఁడును నైన శ్రీనాథునకు ఈ కథావస్తువునందు కొంత ఆత్మీయత గోచరించినది కావున దీనిని గ్రహించియుండును. దీనికిఁ దోడుగ శాంతభిక్షావృత్తి యతీశ్వరుని కోర్కెయును నితని నీ కృతినిర్మాణమునకుఁ బ్రేరేపించి యుండవచ్చును.
మహాకవి శ్రీనాథునకు బాణభట్టారకుని కాదంబరి ననువదించి ఆంధ్రులకుఁ బ్రసాదింపవలయునను కోర్కె యుండెడిది. నైషధమువలె దాని ననువదించు నవకాశము కలుగకపోవుటచే నందలి గుణవిశేషములను, సన్నివేశములను,
సాహిత్య విమర్శ
753