లేదనునవి యన్య దేశీయ జిజ్ఞాసువులు చెప్పిన సూక్తి విశేషములు. ఇట్టి
యభిప్రాయముల నాధారముగఁ గొని మిథ్యాభిమాన ప్రకటన మనియో, శీలసంబంధ
మగు భీతియనియో సిద్ధాంతీకరింప వచ్చును.
సామితేయులు కొందఱు కొన్ని సందర్భముల సభావేదికలఁ నన్యోన్య గుణకీర్తన మొనర్చుకొనినచో వారిని యజ్ఞాహ్వానితులైన దేవతలవలె నింద్రుఁడగ్ని, నగ్ని వరుణుని, వరుణుడు ధర్ముని, ధర్ముఁడు వాయువును హవిర్భాగములఁ గైకొన స్తుతిపాఠము లొనర్చుకొనుచుఁ బరస్పర మాహ్వానించుకొను రీతిగఁ బ్రవర్తించు నొక స్తుతి పాఠక గణముగఁ బరిగణింపని వ్యక్తులు, సమాజములు లోకమున నరుదు కాదు. అట్టి యవసరముల స్తుతి తప్పదు జన మనుకొనుటయుఁ దప్పదు.
కొందఱాత్మ బంధువుల కంటెను, కొందఱు సామితేయుల కంటెను, బ్రేయసీ ప్రియులలో స్తోత్ర పాఠములు విశేషముగ విన్పించును. 'తావలచినది రంభ తామునిఁగినది గంగ.' కవి, 124[1]ఉన్మత్తుడు, ప్రియుఁడు నేకకోటిలోని వారని మహాకవి షేక్స్పియరు పలుకనే పలికినాఁడు. ఇట్టి స్థితిలో వారి స్తోత్రపాఠము లెట్లుండునో యూహించుట కష్టముకాదు. ప్రియాప్రియుల మధ్య నడచు స్తోత్రపాఠములకు మధ్య 'బ్రణయంపు మేలిముసుఁ’ గొకటి కన్పించును. ప్రేమికుఁడు ప్రియనుగూర్చి 125[2]నీవు గంధర్వలోక మధుర సుషమా సుధాగాన మంజురేఖ' వనినను, బ్రియురాలు ప్రియునిగూర్చి నీవు కంతుఁడవో, జయంతుఁడవొ యనినను, 126[3]ప్రియ పాదచిహ్న ములున్న స్థలముల మఱియొకరు ప్రయాగ క్షేత్రములుగ విధురభక్తి భావమున భావించినను వీని నుత్తమ కవితోక్తుల క్రింద మన్నించి వారి యనురాగమును ధర్మేతరమైనను నార్ద్ర హృదయముతో లోకము పరిగణించుచున్నది.
అర్థమునకు స్తుతికి నవినాభావసంబంధము. '....... అతఁడు మహాకులీనుఁ డాతండు కళావిదుండతఁడు ధన్యుఁ డతండు మనోజ్ఞమూర్తి యెవ్వండు భవత్కృ పాకలన వైభవలక్ష్మికిఁ బాత్రుఁడిందిరా!' యని కవి చెప్పనే చెప్పినాఁడు. ఇట్టి ధనవంతునిపై స్తోత్రపాఠపుష్పవృష్టి గురియుటలో సందేహ మేమున్నది? ఇతర విద్యావిశేషములులేని కేవలధనికుఁడు సుతికిమించి స్తుతించెడు స్తోత్రపాఠకునిఁజేరరానీయఁడు. ఇందుకుఁ గారణము స్తోత్రపాఠముపై నభిమానము లేక కాదు; 'అతి సర్వత్ర వర్జయే' తను నార్యోక్తిపై నభిమానమును కాదు. మఱియొక 'కొంటె కోణంగి' స్తోత్రపాఠకుఁడై వచ్చి యిచ్చిన దానితోఁ దృప్తినొందక తన 'బ్రతుకు
బండారము’ను బయటపెట్టు నను భయమిందుకు మూలమని విబుధుల యభ్యూహము.- ↑ 124.కవి యున్మత్తుఁడు "The poet, the lunatic and the lover are all in imagination compact”.
- ↑ 125. నీవు గంధర్వలోక - శ్రీ దేవులపల్లి కృష్ణపక్షము
- ↑ 126. పాదచిహ్నము - శ్రీ శివశంకరశాస్త్రి విరచితము
____________________________________________________________________________________________________
మణిప్రవాళము
75