పాండవవీరులతోఁ బోరుటవలన నైనదియునైన గంధర్వయుద్ధ ఘోషను ప్రదర్శించు యాత్ర [గంధర్వయుద్ధ ఘోష ప్రదర్శికాయాత్రా] యగుటచే నిది ఘోషయాత్ర యైనది. గంధర్వులతో పట్టుబడగా మిగిలిన కౌరవపౌరామాత్యులు దీనులై ఘోష పెట్టుచు ధర్మజుని శరణుజొచ్చుట కేగిరి. అట్టి కౌరవ పౌరామాత్యదైన్య ఘోష ప్రకటన గలది [కౌరవ పౌరామాత్య దైన్య ఘోష సంపాదికా (ప్రకటనా) యాత్రా] గావునను ఘోషయాత్ర యైనది.
ముల్లోకవీరుఁడైన బీభత్సుని అమానుష పరాక్రమముచే గంధర్వులు విజితు లగుటయు, దుర్యోధనునకు ధర్మజుఁడు బంధవిమోచన మొనర్చుటయు, వారి కీర్తి త్రిలోకముల వ్యాపించుటయు జరిగినవి. ముల్లోకముల పాండవకీర్తి ఘోష వ్యాప్తి యాత్ర యగుటచేతను [లోకత్రయే పాండవకీర్తి ఘోష ప్రకటనాయాత్రా] నిది ఘోష యాత్ర యైనది. పాండవుల కీర్తి యెట్లు ముల్లోకములకుఁ బ్రాకినదో అట్లే దుర్యోధనుని ఘోరావమానోదంతమును స్వర్గమందలి దేవతలు, మధ్యమందలి మానవులు, పాతాళమందలి రాక్షసులు తెలిసికొనిరి. అతని అపకీర్తి ఘోష ఇట్లు ముల్లోకముల వ్యాపించుట [లోకత్రయే దుర్యోధ నాపకీర్తి ఘోషరూప యాత్రా] కలది యగుట చేతను ఇది ఘోషయాత్ర. ఈ కథాంశము ముల్లోకముల విస్తరించి యుండుటచే ముల్లోకములందును ఘోషను కల్పించిన యాత్రయగుట వలన [లోకత్రయే ఘోష సముత్పాదికా యాత్రా] ఇది ఘోషయాత్ర యగుచున్నది. ఈ యాత్రకు పూర్వము మహాఘనులమని విఱ్ఱవీగుచున్న కౌరవులకు ఘోషత్వము - కీటత్వము) కలిగినది. అందుచే నిది కౌరవులను కీటకములుగాఁ జేసినయాత్రయై [కౌరవాణాం ఘోషత్వ (కీటత్వ) సంపాదికా యాత్రా] ఘోషయాత్ర యను సార్థకనామమును వహించుచున్నది.
తుదకు ఈ పాండవాపహసన యాత్ర దుర్యోధనునకు అపూర్వ నిర్వేదము (దుఃఖమును) ను గల్పించి ప్రాయోపవేశ మొనర్చు స్థితినిఁ దెచ్చినది. అందుచే దుర్యోధనుని హార్ద వేదనాఘోష ప్రకటనాయాత్ర చేతను ఘోషయాత్ర యగుచున్నది. ఈ యాత్ర కంతటికిని హేతువు ధృతరాష్ట్రుఁడు పాండవులను గూర్చి యొనర్చినస్తుతి (రూప) ఘోష. అందుచే నిది ధృతరాష్ట్రుని పాండవ స్తుతి (రూప) ఘోష వలన కలిగిన యాత్ర కలదియై (ధృతరాష్ట్రవ్య పాండవస్తుతి ఘోషాత్ నిర్వృత్తాయాత్రా - ఘోషయాత్ర యగుచున్నది. ఈ రీతిగా కథాసందర్భముల ననుసరించి ఘోషయాత్రా శబ్దములకుఁ గల అర్థముల నన్వయించుచు ఎన్ని రీతుల పరికించి చూచినను, ఈ ఘట్టమునకు "ఘోషయాత్ర" అను నామ మెంతయుఁ దగియుండి వ్యాసభగవానుని కథాఘట్ట నామకరణాచిత్యమును మనోజ్ఞముగ వెల్లడించుచున్నది.
744
వావిలాల సోమయాజులు సాహిత్యం-4