Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరణ్యవాస జీవితమున గల్గినది. కావున భారత కథయందు ఆరణ్య పర్వమునకు విశేషప్రాముఖ్యమున్నది. ఇందలి ఘోషయాత్రవంటి వృత్తాంతములు కొంతవఱకు భవిష్యద్యుద్ధ హేతువులుగ పరిణమించుటయు నీ పర్వ ప్రాముఖ్యమునకు తోడ్పడుచున్నవి. ఆరణ్యపర్వ శేషమున మార్కండేయుఁడు పాండవుల కడకు వచ్చి బ్రాహ్మణప్రభావము, సరస్వతిగీతి, వైవస్వత వృత్తాంతము, ప్రళయ ప్రకారము, నారాయణ ప్రభావము, గలియుగ ధర్మములు, ఇంద్రద్యుమ్న చరిత్ర, కువలయాశ్వచరిత్ర, మధుకైటభుల చరిత్ర (ఆ. ప్రారంభము] పతివ్రతామాహాత్మ్యము, ధర్మవ్యాధచరిత్ర, అంగిరసుఁ దగ్నియగుట, ఇంద్రుఁడు కేశియను రాక్షసుని బాఱద్రోలుట, కుమార వృత్తాంతముల నెఱిగించుట, ద్రౌపది సత్యభామకు పతివ్రతాధర్మము లెఱింగించుట, ధృతరాష్ట్ర విషాదము, ఘోషయాత్ర, [ఆ. ౫ ప్రారంభము] దుర్యోధన విషాదము, ప్రాయోపవేశము, పాతాళలోక వృత్తాంతము, దుర్యోధన వైష్ణవయాగము, పాండవులు కామ్యకవనమున కేగుట, సైంధవ పరాభవము, రామాయణ కథలో రావణదుష్ట ప్రవచనములు [ఆ. ౫ ప్రారంభము] సీతాన్వేషణము మొదలు రామవిజయము వఱకు రామకథ. సావిత్రీచరిత్రము, కర్ణ జన్మ వృత్తాంతము కర్ణునికవచకుండలము లింద్రుఁడు హరించుట, యక్షప్రశ్నలు, ధర్ముఁడు ధర్మజునకు వరము లిచ్చుట యనునవి కథావిశేషములు. అరణ్యపర్వ విశేషకథయును పూర్వభాగమువలె పాండవులను దైవబల మానవబల సంపన్నులుగా దీర్చిదిద్దుట వారు దేవతావరము లొందుట, ఘోషయాత్ర, సైంధవ పరాభవముల వలన ముల్లోకవీరులని ప్రకటితమై భవిషద్యుద్ధ ఫలితమునకు సూచననిచ్చుట, పాండవులు మహర్షుల వలన బహువిషయములను విని తమను విజ్ఞానవంతులనుగాఁ దీర్చిదిద్దికొనుట యను విశేషములను గల్గి, తరువాతి కథ కెంతయు నుపకరించునదై విశేషప్రాముఖ్యము వహించియున్నది. అందుచే నిట్టి భారతభాగకథను పూరించి ఎఱ్ఱన ఆంధ్రమున భారతకథాశ్రవణ కుతూహలురగువారికి, నూతన కవితామార్గములను జూపి భావి (వక్ష్యమాణ) కవిలోకమునకు మహోపకార మొనర్చినాఁడు.

ఘోషయాత్ర - నామసార్థక్యము

అరణ్య వాసక్లేశములను అనుభవించుచున్న పాండవులయెడ వాత్సల్యము, వారి తపోబల శస్త్రాస్త్రసంపత్తికి భీతియు వెల్లడించుచు, నొకనాఁడు ధృతరాష్ట్రుఁడు సభాముఖమున వారిని ప్రశంసించుట దుష్టచతుష్టయమునకు ఈర్ష్యాద్వేష మాత్సర్యములను ఉజ్జీవింపఁజేసినది. ధృతరాష్ట్రుని ప్రశంసలో సిరి, రాజ్యమిఁక


740

వావిలాల సోమయాజులు సాహిత్యం-4