Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భావము నిగూఢముగనో, యీషత్సృష్టముగనొ వినువారియందుఁ బొడకట్టును. లేకున్న వీరిస్తుతుల వినుటయెట్లు? ఇది యహంకృతి యైనను నాత్మవిశ్వాసమైనను దీనికి మూలకారకులు స్తుతిపాఠకులు. వ్యక్తిద్రోహులైన వీరు రాజద్రోహులు! రాష్ట్రద్రోహులు! జాతిద్రోహులు! ప్రపంచ ద్రోహులు! విశ్వ ద్రోహులు!!! 122[1] అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ' సంఘమునందొకరైన వేరుపురుఁగులగు వీరిని పట్టి శిక్ష చెప్పించుట 'సంఘనీతి’.

స్తోత్రపాఠము చేయువారి, నది విని నిజమని భ్రమించువారి నిరువురఁ జెడగొట్టు శక్తి దానియందున్న' దాని యొక తాత్త్విక మహాశయుని సుసత్య ప్రవచనము. వస్తుతః స్తుతి పరాయణత్వము లేకున్న నది గల్పించి పోషించును. ఆత్మవిశ్వాస మణుమాత్రమైన లేక నణగారిపోవు వారి కది మహాంజనమై వర్తిల్లుటయును సత్యమగుటచేఁ బండితాగ్రగణ్యుఁడు జాన్సను 'పొగడ్త పొందుటయును నొకరీతి శ్రేయస్కరమని ప్రవచించినాఁడు. 'లోక మీ రీతిగ నన్నుఁ గూర్చి భావించుచున్నది కాఁబోలు. నేనీ ప్రథకుఁదగిన శక్తిసామర్థ్యములు సంపాదించెదను గాక' యని నిశ్చయించుకొని కొందఱు తమలో నిద్రించుచున్న శక్తిని మేల్కొల్పుటకు శతవిధ యత్నము లొనర్ప స్తోత్రపాఠము సాయపడవచ్చు నన్నమాట!

ఆత్మబంధువుల మధ్య స్తుతిపాఠములు వినిపించిన లోకము సహింపదు. అందెంతటి సత్యమున్నను బ్రయోజనము లేదు. ఇట్టిస్తుతులకు మూలకారణముల వెదకుట దాని లక్షణము. కుమారుఁడు తండ్రి నే ప్రతిభావిశేషమునకో హృదయపూర్వకముగ నమ్మి స్తుతించిన స్వార్జితమైన సంపదను దండ్రి యన్యాక్రాంత మొనర్చునేమోయను భీతి యిందులకుఁ గారణమని లోకము శంకించును. పితరులే పుత్రునిఁ బొగడిన నివి మేనకోడలిని వివాహమాడఁజేయ బన్నుచున్న వాగురు లని యతని మది నిశ్చయించును.

అల్లుఁడు మామలమధ్య పరస్పరోత్కర్ష కనుపించిన గొడుకులతోఁ బాటు పాలుపంచఁడను భయమునో, కుమార్తె కురూపియగుట నల్లుఁడు పరిత్యజించు నను భయమునో కల్పించి 123[2] ఓడిపస్ కాంప్లెక్సు'ను దలఁ దన్నఁగల యొక 'శ్వశ్రుజామాతా 'కాంప్లెక్సు'ను సృష్టించుటకు వెనుదీయని మానసిక శాస్త్రవేత్తలు మానవలోకమున నుండకపోరు.

భార్యాభర్తల మధ్య స్తుతిపాఠ మంతకంటే నతి ప్రమాదకరమైనది. 'అన్యోన్యము

ప్రేమించుకొనినవారు పొగడుకొనరు. సామాన్యస్త్రీ భర్తను పొగడవలసిన యగత్యము
  1. 122. అంగవ్రాతములో - పోతన భాగవతము - (ప్రహ్లాదఘట్టము )
  2. 123. ఓడిపస్ కాంప్లెక్సు - ఓడిపస్ స్పింక్సు రిడిల్ చదివినవాఁడు, పొరపాటున తల్లిని వివాహమాడినవాఁడు ఓడిపస్ కాంప్లెక్స్ అన Relation between parent and child of opposite sexes held by psycho - analysis to cause repressions.

____________________________________________________________________________________________________

74

వావిలాల సోమయాజులు సాహిత్యం-4