పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్రహించువాఁడగుటచే 'అన్నాతిఁ గూడ హరుఁడవు, అన్నాతిం గూడకున్న నసుర గురుండౌ, దన్నా! తిరుమలరాయా!, కన్నొక్కటి లేదుగాని కంతుఁడవయ్యా!' యని యొకడు స్తోత్రపాఠమును విసిరినాఁడు. అంతటితో నా రాజు తబ్బిబ్బై బహుళ పారితోషికమును దుశ్శాలువల నిచ్చి పంపించినాఁడు.

స్తోత్రపాఠకుఁడు కొన్ని వేళలందు స్తుతించెడివారి యుత్కర్షను నిరూపించుటకుఁ దన్నల్పునిగ జీత్రించుకొనును. 119[1]చౌడప్ప వంటి వాచాప్రాగల్భ్యముగల భట్టుకవి తంజావూరు రఘునాథ రాయలవారి యొద్ద 'నేరుతు నని మాటాడఁగ, వారిజభవు నంత వాని వశమా తంజా, వూరి రఘునాథ రాయలుగా, రెఱుఁగఁగఁ గుందవరపుకవి చౌడప్పా!' యని తన్నుద్దేశించి చెప్పుకొనినాఁడు.

అంతవాడినైన 'నేనే నిన్ను స్తుతించుచున్నాను నీవెంత వాఁడవో చూచుకొ'మ్మనట్లు కొన్ని సందర్భముల స్తోత్రపాఠకులు తమ యాధిక్యమును వర్ణించుటయు సహజము. ఇట్టివారు స్తోత్రపాఠ కులపతులు.

'ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా విదితంబైన మహిన్మహాంధ్ర కవితా విద్యాబలప్రౌఢ నీకెదు రేరీ?” యని సామాన్యస్తోత్ర పాఠకులు తమ్ముఁగూర్చి చెప్పికొనుట పరిపాటి. ఒక సామాన్యమైన సామంతుని పట్టుకొని మహాకవి తిక్కనవలె 120[2]'ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడఁగు... నెవ్వాని గుణలత లేడు వారాశుల కడపటి కొండపైఁ గలయఁ బ్రాకు' - ఇత్యాది స్తోత్రపాఠ పరంపరలఁ గురిపించుటయును లోక సహజము. ఈ యసత్యస్తుతులు ప్రాఁత కాలపునాఁటి వని పరిహసింప వీలులేదు; ఈ శతాబ్ది యందును వినిపించుచున్నవి.

అట్టి స్థితిలో గీర్తికాములైన పూర్వరాజన్యులు కొంద రప్రశస్తము లయ్యు నగ్నములైన యసత్యములు కాని యిట్టిస్తుతులకు మురిసి యే సంక్రాంతి పుణ్యకాలముననో పెద్దల పుణ్యమునకని పేరు పెట్టి 121[3]సర్వబాధా పరిహారముగ దేవమాతృకలు పండు కేదార ఖండముల స్తుతి పాఠకులకు దానమిచ్చిరని యీ నాఁడు మనము బాధపడుట యెందులకు?

స్తుతి పాఠకులు పరస్తుతి పరాయణులు కాని పరదూషకులు కాదు. అయినను పరవంచులు. వీరివలన వినువారు చెడిపోవుట నిస్సంశయము. వీరు లోకమున

స్తుతిగీతా ప్రియత్వమును బెంపొందితురు. వీరి స్తోత్రములకుఁ దగినవార
  1. 119. చౌడప్ప - సుప్రసిద్ధాంధ్ర తిట్టుకవి
  2. 120. ఎవ్వాని వాకిట - ఇందు తిక్కన ధర్మరాజును వర్ణించినాఁడు - విరాట పర్వము ఆ. 2
  3. 121. సర్వబాధా పరిహారము - ఎట్టి పన్నులు లేనిది

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

73