ఒక పాత్ర తనకు ద్వారకను వర్ణించి చెప్పుటయనెడి యానందము నతఁడనుభవించును. ఇందువలన నెంతటి దీర్ఘవర్ణనమైన విసుగును గల్పింపదు. ఈ రీతిగ సూరన ద్వారకావర్ణనమున నొక నవ్యతను జూపినాఁడు. తన ప్రబంధ ప్రారంభమునందే యొక నవ్యత నిట్లు ప్రదర్శించిన ఖ్యాతి పింగళి సూరనార్యునిదే.
ఈ ద్వారకానగర వర్ణనమున ఉత్ప్రేక్ష సందేహములనెడి యలంకారములను సూరనార్యుఁడు విరివిగ వాడియున్నాఁడు. ఈ రెండును ఆశ్చర్యములతోఁ గూడినయానందము నొసంగుటకు సమర్థములు. రాక్షసబాధ వలన మానసిక వ్యథ ననుభవించు ఇంద్రుఁడు కృష్ణునిపై బుద్ధినిడి యాశతో వచ్చుచుండగా, నాతనికి శ్రీకృష్ణుని నగరమగు ద్వారక ఇట్టియానందమును కూర్చుట యొకరీతిగ భావిఫల ప్రదర్శకముగ నున్నదని చెప్పదగును.
ఇది సూరనార్యుని వర్ణనసార్థకతకు నిదర్శనమై యొప్పుచున్నది. ఇందు కొన్ని పద్యములు (తను తరుణి తటిద్విహృతిన్, భోగపుచుట్లు కోటలుగ, అవచూడోపలదీప్తి చిత్రితములై) ఇత్యాదులు ఆంధ్రప్రబంధములందలి నగర వర్ణనములందలి పద్యములలోనెల్ల నుత్కృష్టస్థాన మాక్రమింపదగినవై యొప్పుచున్నవి.
బ్రాహ్మణవర్ణనమునందును నవ్యత గోచరించుచున్నది. ఈ వర్ణనమును భద్రునిచేఁ జేయించుట వలన, పాఠకునకు దీనిని కవియే స్వయముగ నిట్లు వర్ణించినాఁడను భావము కలుగదు. ఔచితికి భంగము లేనిరీతిగ, అవసరవర్ణనమని పాఠకునికి అనిపించునట్లు చేసిన ఈ బ్రాహ్మణవర్ణనము హాస్యరసపూరితమై పాఠకునికుత్సాహమును గల్గించుచున్నది.
నవ్యమార్గము ననుసరించి యొనర్చిన ఈ బ్రాహ్మణవటు వర్ణనము వలన బ్రహ్మచారులు "ఆటవాండ్రని నమ్మి మీ స్వభావము” అని భద్రుని యాక్షేపించుటయు, ఇంద్రకార్యము దెస వర్తిల్లు చిత్తముతో నున్న కృష్ణుఁడు తనయపేక్షకు సమాధానముగ దానిని స్వీకరించుటయును, జరిగినవి. వటువుల వాక్యముల ననుసరించియే ప్రద్యుమ్న గదసాంబులు వజ్రనాభపురిని ప్రవేశించి వాని వినాశనమునకు కారణులైనారు.
భద్రవటుని బ్రాహ్మణవర్ణన మూలముగా వటువులు అప్రయత్నముగను, అన్యాపదేశముగను వజ్రనాభవధకు బీజమును నాటినారు. ఈ ఘట్టము కావ్యమునకు ప్రాణపదము.
714
వావిలాల సోమయాజులు సాహిత్యం-4