తిరిగెడి పూఁదోటలవలెను, మేడలగుంపువలెను, నీటితుంపురులు పెద్దజల్లు కాన్కలు పెట్టు ముత్యాలవలెను ఉండగా, నీ ద్వారకానగరపు కోటచుట్టు తవ్విన యగడ్త లాయా దిక్కులందలి గాలిపాటులచే నీ పురశ్రేష్ఠమును కొలుచుటకై శాసనపూర్వకముగాఁ గొనిరాఁబడిన శత్రుపురముల వరుసవలె ప్రకాశించుచున్నది.
'ఈ నగరమునకు పడమటి దిక్కునందు సముద్రమున్నది' అని యెఱిఁగిన పెద్దలు చెప్పుకొను మాట తప్ప నితరుల కీ పురమునకు నాల్గువైపుల నున్నట్టివి యగడ్తలో లేక సముద్రములో తెలిసికొనశక్యము గాదు. ఈ నగరమందలి స్త్రీలనెడి మెఱపులు సంచరించుటచే ధన్యమైన వనపంక్తి తన్ను మిక్కిలిగా మీఱుటను జూచియును మేఘము సిగ్గు లేక యిచ్చటికి వచ్చిన వచ్చుగాక, ఒకవేళ నది రాకున్నను నీ పురమందలి జనుల పైరు పంటలకు క్రింద ప్రవహించు పూఁదేనెల ప్రవాహములే చాలును. మేఘము రాకున్న నీ నగరమునకెట్టి లోపమును గలుగదు.”
ఈ రీతిగా రథిక సారథులైన ఇంద్రుఁడును మాతలియును నాయా వస్తువులుఁ జూచినపుడు సమయోచిత సంభాషణలతో వినోదించుచు, కొంతదూరము గడచి భూమికి దిగిరి.
ప్రథమాశ్వాస కల్పనలు - ప్రయోజనములు
శ్రీకృష్ణరాయల పరిపాలనకాలమునుండి (క్రీ.శ. 15వ శతాబ్ది పూర్వార్ధమున) నుండి ఆంధ్రసాహిత్య ప్రపంచమున ప్రబంధములనెడి నూతన కావ్యములు పుట్టినవి. వీని రచనకు తొలుత తన శృంగార నైషధ కావ్యరచనచే మార్గదర్శియైనవాఁడు శ్రీనాథుఁడు. తఱువాత పెద్దన, నందితిమ్మనాదులు ఈ ప్రబంధ రచనామార్గము ననుసరించిరి. వీనియందు కథకంటే అష్టాదశవర్ణనలకు ప్రాముఖ్యమధికము. ఈ దృష్టితోఁ జూచినచో భట్టుమూర్తి వసుచరిత్ర సమగ్రమైన ప్రబంధ లక్షణములు గల కావ్యము.
పెద్దన మనుచరిత్రయందును ప్రబంధమునకు వలసినదానికంటే కథ యధికముగా నున్నది. పింగళి సూరనార్యుఁడు కథాకల్పనముపై విశేషమైన మక్కువ గలవాఁడు. అతని కళాపూర్ణోదయమునందు కథ నానారీతులు పెరిగిపోయినది. ఆ లక్షణము కొంతగా ఈ ప్రభావతీప్రద్యుమ్నము నందును కన్పట్టును. వసుచరిత్రాది ప్రబంధములందలి కథలతో పోల్చినచో, ఈ కథయును దీర్ఘమైనదనియే చెప్పవలసివచ్చును.
సాహిత్య విమర్శ
709