శుచిముఖి పూనుకొనఁగా, ఉపనాయికానాయకుల ప్రణయ కార్యభారము నంతకంటె గొంతగ నల్పసామర్థ్యము గల వ్యక్తి పూనుకొనిన దన్నమాట! ఇట్లు రెండు శృంగారకథావాహినులను పింగళి సూరన తన కావ్యమున సంగమింపఁజేసినాఁడు (శ్రీ పింగళి). వజ్రనాభవధకును, ప్రభావతి వివాహమునకును మూలమున నెట్టి సంబంధమును లేదు. సూరనార్యుఁడు తండ్రి చావునకును, కుమార్తె వివాహమునకును అవినాభావసంబంధమును కల్పించి, ఏకసూత్రమున కథను నడిపించి కథకు నిబిడత్వమును జేకూర్చినాఁడు.
మూలమునందు వజ్రనాభవధానంతరము ఇంద్రుఁడు రాక్షసరాజ్యమును తన కుమారుఁడైన జయంతునికి, కృష్ణుని కుమారులకు, సోదరులకుఁ బంచి ఇచ్చినట్లున్నది. వజ్రనాభోపద్రవము నుండి తన్ను దాను రక్షించుకొనఁజాలక 'రక్ష రక్ష జనార్దన' యని తొలుత వేడుకొన్న ఇంద్రుఁడిపు డిట్లు కృష్ణుని సరకుగొనక స్వతంత్రించినట్లు వర్ణించుట పాత్రోచితికి భంగకరము. కావున సూరనార్యుఁడు యుద్ధానంతరము లభించిన రాజ్యభోగములను బంచుకొనుటకు తనవారం బంపి, వజ్రనాభుని హతమార్చిన శ్రీకృష్ణుని మధ్యవర్తిగ నిలిపి, ఉచితిజ్ఞతను బాటించినాఁడు. మూలమునందు వజ్రనాభునికొక కుమార్తె (ప్రభావతి) కలుగునట్లు వరమిచ్చుటయే తప్ప, ప్రభావతి ప్రణయకథలో పార్వతికెట్టి సంబంధమును లేదు. సూరనార్యుఁడు రవివర్మనుండి గ్రహించియో, మఱి స్వయముగా నూహించియో ప్రభావతిస్వప్నమును, చిత్రపట సన్నివేశమును గల్పించినాఁడు. ఇది మనోజ్ఞమైన కల్పనము. దీనివలన సూరనార్యుఁడు ఎన్నో ప్రయోజనములను సాధించినాఁడు. వజ్రపుర ప్రవేశమొనర్చి, వానిని సంహరించువాఁడెవ్వఁడా యని ఇంద్రోపేంద్రు లూహించువేళ, శుచిముఖివలన చిత్రఫలక వృత్తాంతమును వినిపించి, ప్రద్యుమ్నుని మూలమున నీ కార్యమును సాధింపవచ్చుననెడి యాశను యింద్రునకుఁ గల్పించినాఁడు.
శృంగార ప్రబంధమగు నీ ప్రభావతీ ప్రద్యుమ్నమున ప్రభావతి ప్రథమదర్శనవేళనే యెంతటి యుక్కటానురాగము నొందినదో తెలిపినాఁడు. ఇట్లే భద్రనటునకును, ధూర్తవటువులకును జరిగిన సంభాషణమనెడి రసవత్సన్నివేశమును సూరనార్యుఁడే కల్పించెను. ధూర్తవటువుల వాక్యములను కృష్ణుఁడుపశ్రుతిగా గ్రహించి ప్రద్యుమ్నుని నటవేషమున వజ్రపురమునకు పంపుటయనెడి నిశ్చయమొనర్చుట కీ సన్నివేశము తోడ్పడుచున్నది. ప్రభావతికి ప్రద్యుమ్నుని భర్తగా మున్నే పార్వతి నిశ్చయించుటయను నంశము సూరన కల్పనయే.
706
వావిలాల సోమయాజులు సాహిత్యం-4