నియమమును కొన్ని దృశ్య ప్రబంధములు పాటింపకపోయినను, ఇది యొక సామాన్య లక్షణముగా గ్రహింపదగియున్నది. ఆంధ్రసాహిత్యమున ప్రబంధములందు శృంగారము ప్రధాన రసముగా గోచరించును. పింగళి సూరనకును శృంగారరసముపై ప్రీతి యధికము. కళాపూర్ణోదయమును గూర్చి తెలుపుచు నాతఁడు దానిని శృంగార రసప్రాయమని వర్ణించినాఁడు.
ప్రభావతీప్రద్యుమ్నమునందును శృంగారమే ప్రధానరసమని చెప్పనగును. ఇందు సూరన శృంగారమును ప్రధాన రసముగ గ్రహించినాఁ డగుటవలననే, నాయికా నాయకుల పరముగా కావ్యమునకు ప్రభావతీ ప్రద్యుమ్నమని నామకరణమొనర్చినాఁడు.
ప్రభావతి శివ వ్రాసి యిచ్చిన చిత్రపటము నందలి ప్రియుఁడగు ప్రద్యుమ్నుని చూచినపుడు యామెయందు బొడమిన శృంగార భావాదులను వర్ణించి యా రసమును నిక్షేపించినాఁడు. శుచిముఖి చేసిన ప్రభావతీవర్ణనమును విని 'వినుకలి' (వినుటచే నగు ప్రేమవలన కలుగు విరహము) కి చిక్కిన ప్రద్యుమ్నుని యందును రసమును సూరనకవి జాగరూకతతో నిక్షేపించినాఁడు. ఇరువురియనురాగమును పోషించి దాని పరిణామావస్థల ప్రదర్శించి ఈ ప్రభావతీప్రద్యుమ్న కావ్యమున శృంగార రసస్వరూప నిరూపణ మొనర్చినాఁడు.
ఇందు సర్వవిధములైన పూర్వరాగ విరహ రసాభాస సంభోగాది శృంగార విభేదములను చూపినాఁడు. ఇందుమూలమున రసవిషయమునను సూరన ప్రకృష్ట బంధతను (ప్రబంధతను) సాధించినాఁడు. ఇందు వీరాదు లంగరసములుగ నున్నవి.
పంచ కార్యములు
నాయికానాయకుల యనురాగకథకును, వజ్రనాభవధకును తగిన ఆరంభయత్న ప్రాప్త్యాశ ఫలాగమము లనెడి పంచకార్యముల నడిపి, కథారచనమునందును సూరన ప్రబంధ లక్షణమును సాధించినాఁడు.
అష్టాదశ వర్ణనలు
ప్రబంధమున కష్టాదశవర్ణనములుండుట ముఖ్యలక్షణము. ఈ వర్ణనములలో నెన్ని యధికముగ నున్న నా కావ్యము ప్రబంధ లక్షణమంత యధికముగా సాధించిన దగుచున్నది. ఈ యష్టాదశ వర్ణనములు ఇవి :
702
వావిలాల సోమయాజులు సాహిత్యం-4