శుచిముఖిపాత్రకు అనంతప్రాధాన్యము నిచ్చి ఇంద్రోపేంద్రులవంటి ప్రముఖులను అసమర్థులుగను, అవశులుగను చిత్రించుట రెండవ దోషము. శుచిముఖి యనెడు హంసను కృష్ణ ప్రద్యుమ్నుల పక్షమున నిల్పినట్లే, వజ్రనాభుని పక్షమున చిలుకను నిలిపి ఈ రెంటిచేత నెత్తుకు పై ఎత్తు వేయించిన బాగుండెడిదని యొక విమర్శకుని సూచన (డా. చిలుకూరి), ఇంద్రకృష్ణులకు, శుచిముఖికిని నికటసంబంధము నేటి కథలో లేదు. అట్టిదానిని కల్పించిన బాగుండెడిదని యొక యూహ. నేడు శుచిముఖి పూనుకొనినదంతయును నూసుబోని పనియని తోచుచున్నదట. ఇంద్ర రాజ్యములోని ప్రాణులగు హంసలకు దేవకార్యమునకుఁ బూనుకొనుట కర్తవ్యమగునుగదా!
వసుదేవుని యజ్ఞము, అందు భద్రనటనాట్యము, వటు ధూర్తత్వములు అనవసరములనియు నొక విమర్శ, కృష్ణునంతటి ధీశాలికి ధూర్తబ్రహ్మచారి వాక్యముల నుపశ్రుతిగ గల్పించుట యొక లోపముగ కొందతెన్నెదరు. ప్రద్యుమ్నుని అశ్వవిహార వర్ణన మప్రస్తుతమనియు, కవికి దానిని వర్ణింపవలె ననెడి కుతూహలము తప్ప దాని ఉనికికి తగిన హేతువు లేదనియు నొక యభిప్రాయము. ప్రద్యుమ్నుఁడు భద్రుని వేషమున పట్టణమునందున్నప్పుడు అతఁడేమి చేయుచున్నాఁడో గుర్తింపనంతటి మూర్ఖుఁడుగాను, అవివేకిగాను వజ్రనాభుఁడు చిత్రింపఁబడుట యొకదోషముగ నెన్నఁబడుచున్నది. ప్రభావతీప్రద్యుమ్నుల మితిమీరిన వర్ణనలు ఈ కావ్యమున పెద్దవై వస్తువునందలి బింకమును చెడగొట్టుటచే, వస్వైక్యము చెడుట యొకలోపముగ చెప్పఁబడుచున్నది. ప్రభావతీప్రద్యుమ్నుల రతిని, ఉపరతిని విపులముగ వర్ణించి నడివీథిన బెట్టుట యొక లోపముగఁ జెప్పబడుచున్నది. ఇట్టి దోషము లెన్నియున్నను, ఇందలి గుణములు వాని ననేకరీతుల నతిశయించి ప్రభావతీ ప్రద్యుమ్నమునకు ఆంధ్రకావ్య ప్రపంచమున నొక మహనీయ ప్రబంధముగ విఖ్యాతిని గడించిపెట్టినవి. ప్రభావతీప్రద్యుమ్నము - మహాప్రబంధము ప్రబంధ శబ్దమునకు ప్రకృష్టమైన బంధము గలదియని యర్థము. ఈ బంధము వస్తురస రీతులందు ఉండవలెను. తిక్కన మహాకవి భారత కృత్యాదియందు తన రచనలను ప్రబంధమండలిగా బేర్కొనినాఁడు. కాని యట తిక్కన వాడిన