Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాడుట సూరన యుచితజ్ఞతకు ఒక నిదర్శనము. 'శ్లేష'ము ఘటించుటలో నద్వితీయ పండితుఁడై రాఘవ పాండవీయకృతిఁ జెప్పిన యీతఁడు, తన రసవత్కావ్యమైన దీనియందు దానిని ఎచటనో తప్ప యుపయోగింపకపోవుట యీతని ఉచితజ్ఞతను వెల్లడించుచున్నది.

రసోచితభాషాప్రయోగము

“సూరనయందు ప్రబంధకవులకు గల వర్ణనశక్తితోడ వారికి లేని కథా కల్పనాశక్తియు వివిధములైన సందర్భములను సంధానమునకు దెచ్చు ప్రతిభయు సహవాసములు, మఱియు భానవాశక్తికిఁ దోడు భాషాశక్తియు నీతనికిఁ గలదు.” (కట్టమంచి - కళాపూర్ణోదయపీఠిక). ప్రభావతీ ప్రద్యుమ్నమునకు గుణాధిక్యమును సంపాదించిన విశేషములలో నాతని భాషాప్రయోగ మొకటి. సామాన్యముగ నీతనికి సంభాషణవైచిత్ర్యముపై నభిమానము గావున నీతని వాక్యములు అలఁతియలఁతి తునియలుగ సాగుచు నాటకోచితరీతిని ప్రదర్శించుచుండును.

వర్ణనలం దీతని భాష నిబిడమై సమాసభూయిష్టముగ నుండును. వసుదేవ యజ్ఞమును వర్ణించుచు నీతఁడు చెప్పిన సీసపద్య మిందుకు నిదర్శనము. సహజముగ నీతని భాషయందు క్లిష్టత లేదు. పదమైత్రి అర్థసంపదలతో నొప్పును, ముత్తెపుసరులు పోహళించిన రీతిగా నీతని భాషలో శబ్దములు తమంతట తామే దొరయును, భాషయందు సహజమాధుర్యము గోచరించును. శుచిముఖియందు సహజవాణీ రామణీయకమున్నట్లు సూరనార్యుఁడు చెప్పిన వాక్యము, తన భాషకే అన్వయించునట్లు చెప్పినాఁడేమోయని మనమూహింపవచ్చును.

పై గుణములలోనెల్ల ప్రధానమైనది కథానుసంధానవైచిత్రితో గూడిన కథాకథనము. రాజకీయ, ప్రణయవృత్తాంతములతో రెండు ప్రత్యేకస్రవంతులుగా నడచు కథ నొక మహావాహినిగా నీ మహాకవి సంధానమొనర్చుట యిందలి గుణములలో నెల్ల నుత్తమమైనది.

దోషములు

విమర్శకులు ప్రభావతీప్రద్యుమ్నమునందు కొన్ని దోషముల నెన్నుచున్నారు. శుచిముఖి చిలుకలనెడి పక్షులను పాత్రలుగా స్వీకరించి, నాటక ప్రయోగమునకు భంగమును కలిగించుట యొక దోషము. ఇది నాటక ప్రయోగ సంబంధి.


698

వావిలాల సోమయాజులు సాహిత్యం-4