Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రభాషలో నీ మార్గము ననుసరించినవాఁడు సూరన తప్ప మతెవ్వఁడును లేఁడు. కళాపూర్ణోదయమునం దీ మహాకవి ఇట్టిమార్గము ననుసరించుట వలననే నా కావ్యమునకంతటి విలక్షణత, విఖ్యాతి కలిగినవి.

ప్రభావతీప్రద్యుమ్నము నందును సూరనార్యుఁడు కథ చెప్పుటలో తాను కళాపూర్ణోదయమున ననుసరించిన కార్యకారణ క్రమపద్ధతినే యనుసరించినాఁడు. ఇందు వజ్రనాభరాక్షసబాధల వలన వేసారిన ఇంద్రుఁడు, వాని వధ కుపాయమును గూర్చి కృష్ణునితో నాలోచించుటకు ద్వారకకు వచ్చుటతో కథను సూరన ప్రారంభించినాఁడు. ప్రబంధములలో నిందు కనుపించునంతటి సుదీర్ఘమైన కథయే యుండదు.

ప్రబంధకవి ప్రభావతీప్రద్యుమ్నమునందలి కథను జెప్పవలసినచో, కాలక్రమ పద్ధతి ననుసరించి ముందుగనే వజ్రపుర వర్ణనముతోనో యారంభమొనర్చి, తదుపరి వజ్రనాభుని ఘోరతపమును, బ్రహ్మ ప్రత్యక్షమగుటను, వాని స్వర్గజైత్రయాత్రను, ఇంద్రుని నిర్వేదమును, ప్రభావతీజననమును, స్వప్నవృత్తాంతమును, ఇంద్రుఁడు ద్వారకకు వచ్చుటను కాలక్రమమున వర్ణించియుండెడివాఁడు. ఇట్టిపద్ధతి చరిత్ర కనువైనదిగాని రసవత్కావ్యరచనమున కనువైనది కాదని గ్రహించి, స్వత్రంత మార్గమును ద్రొక్కుటకు జంకని సూరనార్యుఁ డీ మార్గముననుసరించి, తన కళాపూర్ణోదయ ప్రభావతీప్రద్యుమ్నముల రెంటను కథఁ జెప్పినాఁడు.

పాత్రోన్మీలన సామర్థ్యము

మహాకవుల శక్తిసామర్థ్యములను వెల్లడించు కవితాగుణములలో పాత్రోన్మీలన సామర్థ్యము ప్రముఖమైనది. స్వీకరించిన కథలోని వివిధపాత్రల భావనాబలముచే నూహించి, నానికి రూపమునిచ్చి సజీవమూర్తులనుగా చిత్రించుటకు అసామాన్యశక్తి కావలయును. ఈ శక్తి ఏ మహాకవియందధికాంశమున గోచరించునో, యాతఁడు నిర్మించిన పాత్రలకు నిత్యత్వము కలిగి యా మహాకవికీర్తిని చిరస్థాయిగ నొనర్చును. ఆంధ్ర సాహిత్యమున నిట్టి పాత్రచిత్రణ సామర్థ్యము గల కవులెందరో లేరు. తిక్కన భారతమునందలి పాత్రలు వ్యాసునివే యైనను, యా కవిబ్రహ్మ వానిని పునఃసృష్టించినాఁడు. కావున తిక్కన భారతమునందలి పాత్రలు సజీవమూర్తులు. పెద్దన ఇదేరీతిగ తన మనుచరిత్రమునందు వరూథినీప్రవరాఖ్య పాత్రలను పునఃసృష్టించి కవితాపితామహుఁ డనిపించుకొనినాఁడు. పిమ్మట చెప్పదగినవాఁడు సత్యభామ పాత్రను తన పారిజాతాపహరణ కావ్యమున పునఃసృష్టించిన తిమ్మన.


సాహిత్య విమర్శ

693