ప్రభావతీప్రద్యుమ్నము - కావ్య గుణదోషములు
అపూర్వ ప్రతిభాన్వితుఁడును, కావ్యశిల్పదక్షుఁడునునై ఆంధ్రసాహిత్య ప్రపంచమున నొక దృష్టితో పరిశీలింపగా, తిక్కనార్యునకు పిమ్మట ద్వితీయస్థాన మాక్రమించిన కవిశ్రేష్ఠుఁడు పింగళి సూరన. ఈతని కృతులలో కళాపూర్ణోదయమనెడి కావ్యము సర్వశ్రేష్ఠగ్రంథమై, కథాకథన వైచిత్రికి దానితో తుల్యమైన కావ్యము మఱియొకటి లేదని ఖ్యాతిగన్నది.
ఇందు విమర్శకులు గుణదోష విచారమొనర్చి ఎన్ని దోషములున్నను నవి యల్పములనియును, గుణములే యధికములనియును నిర్ణయించిరి.
సూరనార్యుఁడు తన పండబారిన వయసున నిర్మించిన ఈ ప్రభావతీప్రద్యుమ్న కావ్యమందలి గుణదోషముల విషయమున పండితులు భిన్నాభిప్రాయులైయున్నారు. కొందఱు అల్పదోషముల నావల నుంచిన నిదియును సర్వోత్కృష్టమైన ప్రబంధమనియును, గుణవిశేషములలో నిది దేనికిని తీసిపోనిదనియును భావింతురు. అనేక ప్రబంధములనుండి గ్రహించిన కథావస్తువర్ణనాదులతో నిదియొక జల్లికూర్పనియును, నిందు సూరనార్యుని ప్రతిభ ప్రతిఫలించుట లేదనియు మఱికొందరి అభిప్రాయము. (డా. కట్టమంచి, డా. చిలుకూరి ప్రభృతులు) ప్రభావతీ ప్రద్యుమ్నము నందును సూరనార్యుని కథాకథనదక్షత, పాత్రోన్మీలనప్రజ్ఞ, మానసికస్థితి నిరూపణము, నాటకోచితరీతి, అవసరోచిత వర్ణనలు మొదలగు గుణవిశేషములు, కన్పట్టుచున్నవి. ప్రబంధసామాన్యములైన నఖశిఖపర్యంత స్త్రీవర్ణనలు, చంద్రాది దూషణములు మొదలగు యాధునికులు పరిగణించు కొన్ని దోషములును కన్పట్టుచున్నవి.
కథాకథనము
కథ చెప్పుటలోని శిల్పమునకు పింగళి సూరనతో సాటియైన కవిశేఖరుఁడు ఆంధ్ర సాహిత్యమున లేఁడని చెప్పవచ్చును. కథ చెప్పుటకు రెండు పద్దతులున్నవి. కథయందు జరిగిన యంశములను బట్టి కాలక్రమానుసారముగా కథను చెప్పుట యొక పద్ధతి. దీనిని కాలక్రమ పద్ధతి యందురు. కాలక్రమమును వదలి సరసముగ నొక సందర్భమును గైకొని కథ నారంభించి, తఱువాత ముందు వెనుకగా కథను పెంచి పూర్తియొనర్చుట రెండవ పద్ధతి. దీనిని కార్యకారణ క్రమపద్దతి యందురు. రసప్రధానములైన కావ్యములందు కార్యకారణక్రమముగ కథ చెప్పుటయే సముచితము.
692
వావిలాల సోమయాజులు సాహిత్యం-4