Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వంభరావలయంబు తన బాహుపురి మరకతముఁజేసె" (ప. 30) “ఆలపోత్రి ప్రభుదంష్ట్ర" ఇత్యాదులు జిగిబిగులు రెంటిని బ్రదర్శించుచున్నవి.

రత్నములు పొదిగిన రమణీయ కంఠాభరణమొనర్చు స్వర్ణకారునివలె శబ్దరత్నములను జిగిబిగి యొప్పఁగా బొదుగుట యిందు గన్పట్టును. కథాభాగమునందు జిగిబిగితో నొప్పు శైలికి నిదర్శనములైన పద్యములెన్నియో యున్నవి.

'ఆ పురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి' అన్న పద్యమున జిగిబిగులొప్పు శైలితో పెద్దన ప్రవరుని ప్రవేశపెట్టినాఁడు. అతని రూప సౌందర్యమును తొలుత మకరాంక శశాంక మనోజ్ఞమూర్తియని చెప్పి, తుదకు మఱల 'అలేఖ్య తనూవిలాసుఁడై' అనుటచే జిగిగల రెండు రత్నముల నాద్యంతముల నిల్పి బిగువు మెఱయు నల్లిన యొంటి పేటహారము వలె పెద్దన పద్యమును లాగుట గమనింపవలసి యున్నది. జిగిని గూర్చుటలో పెద్దన భావమునకుఁ దగిన శబ్దజాలము నెన్నుకొనుటయు తగిన విడుపులతో, ఒంపుసొంపులతో వాక్యములు నడుపుటయుఁ జూపించును. ఇందుకు సిద్ధుఁడు పాదలేపమును కాలికి పూసిన పిమ్మట ప్రవరుఁడు హిమవంతమున కేగుటను వర్ణించునపుడు పెద్దన చెప్పిన :

క. “ఆ మందిడి యతఁడరిగిన భూమీసురుఁడరిగె తుహిన భూధరశృంగ శ్యామల కోమల కానన హేమాఢ్యదరీ ఝరీ నిరీక్షాపేక్షన్.” అను పద్యము జిగిబిగులతో ప్రవరుఁడు హుటాహుటి నడకలనే గుటను గన్నులగట్టున ట్లొర్చుచున్నది. పద్యమందు మాత్రమే కాక, ఈ జిగిబిగులను గొనివచ్చుట పెద్దన వచనమునందును బ్రదర్శించినాఁడనుటకు సిద్ధుఁ డాయా దేశ విశేషములు దెల్పుచు చెప్పిన వచనమునందలి "లంబమాన రవి రథ తురంగ..., వికట కూట కోటి విటంక..., స్వప్న ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ...” ఇత్యాది వాక్యములు నిదర్శనములు.

పెద్దనార్యుఁడు ఐంద్రియతృప్తి యొనర్చు కవి (Poet of the senses) యగుటయు నీ జిగిబిగిని సంపాదించుటకుఁ దోడ్పడుచున్నది.

జిగిబిగులతో కూడిన అల్లసాని అల్లికలో వింత వైవిధ్యమున్నది. వాక్యనిర్మాణ విషయమున నీ యల్లికయందలి విభేదముల నెన్నింటినో పెద్దన ప్రదర్శించినాఁడు.సాహిత్య విమర్శ 681