Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దారి చూపుట గమనింపదగియున్నది. గృహస్థుల జీవనమును గూర్చి 'నికృష్ట'మనునభిప్రాయము ప్రవరుఁడు వెల్లడించినాఁడు గదా! దానికి ఎఱిఁగినవాఁడుగాన సమాధానము చెప్పకుండరాదు. చెప్పకుండు టెట్లు? సిద్ధుఁడు 'కెలఁకులనున్న తంగెటిజున్ను గృహమేధి యజమానుఁడంకస్థితార్థ పేటి' ఇత్యాదిగా గార్హస్థ్యమును నిరతిశయమైనదని నానా నిరూపణ వైచిత్ర్యముతో రమణీయముగ వర్ణించినాఁడు.

ఇందు పెద్దన సిద్ధునిచే పండితులు సంభాషణములందు వాడుకొను 'తంగెటి జున్ను', 'అంకస్థితార్థపేటి', 'పండిన పెరటి కల్పకము' ఇత్యాదులను ప్రయోగింపజేయుట భాషయందును సహజత్వమును సంపాదించుటకేయని గ్రహింపవలయును.

దీనికి బిమ్మట ప్రవరుఁడు సిద్ధుఁడు ప్రయోగించిన 'తైర్థికావళి', 'తీర్థసేవ' అన్న పదములను ఊఁతగా గొని యతిసహజముగఁదోప 'పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థమహిమ వినుటయు నఖిల కల్మషహరంబ' అని చాతుర్యమొప్ప పల్కి ప్రార్థింపఁగా, సిద్ధుఁడు తా నాయా దేశములందుఁ జూచిన యద్భుతముల నెల్లఁ జెప్పి వానిని దైవానుగ్రహము వలన నల్ప కాలములోఁ గనుఁగొనజాలితి నని తెలిపినాఁడు. అట్టి స్థితిలోఁ బ్రవరునకిది యంతయును కల్లగాఁ దోచుట సహజము. నవ్వు వచ్చినది. దానిని చెక్కిళ్ళతో కాచుకొనినాఁడు. అవిశ్వాసముతో నడుగుట దోషము. అతనికిఁ గల్గిన యాశ్చర్య మడుగుమనుచున్నది. అప్పుడు ప్రవరుఁడు తన అవిశ్వాసమను కటుత్వమునకు భక్తియను తీపిని చేర్చి 'రసవ్యంజకముగా' నెఱవక యని చెప్పి సంభాషణ మారంభించినాఁడు. ఈ సందర్భమున పెద్దన ప్రవరుని చేష్టాదికమును, మనోవృత్తిని అతిసహజముగ పాత్రోచితముగ నిరూపించినాఁడు.

ప్రవరుఁడు సిద్ధునితోఁ జేసిన "వెఱవక మీకొనర్తు నొకవిన్నప మిట్టివియెల్ల జూచిరా... ఏమి సెప్పుదున్" అన్న సంభాషణమున భక్తివలన భయము కల్గినది. అయినను వెఱువక యడుగుచున్నాననునది యాకూతము. ఇట యతఁడొనర్చినది అవిశ్వాసముచేఁ జేయు ప్రశ్నము కాదు. జిజ్ఞాసచేఁ జేయు విజ్ఞాపనము. ఈ విన్నపమును ప్రవరుఁడు గౌణముగాను భావగర్భముగాను 'ఇట్టివియెల్లఁ జూచిరా నెఱకలుగట్టుకొన్న మఱి యేండ్లును బూండ్లును బట్టు' ననియు, 'ప్రాయపుం జిఱుతతనంబు మీ మొగము చెప్పక చెప్పెడు' ననియు రెండు వాక్యములు పల్కియారెంటికిని నిగమనమును ఊహనీయముగాఁ దేల్చినాఁడు.

ఈ మాటలందును తన అవినయము వాసన కొట్టుచున్నదేమోయని యనుమానించి, దానిని పోగొట్టుటకై అట్లు యాత్రలొనర్చుటలెల్ల నాతని మహిమలుగాన


676

వావిలాల సోమయాజులు సాహిత్యం-4