ప్రవరుని తీర్థ సందర్శనాభిలాష ఉత్కటమైనది. సిద్ధుఁడు రాగా నాతనితో నితఁడొనర్చిన సంభాషణమున వినయమును, భక్తిని వెల్లడించినాఁడు. తన తీర్థయాత్రోత్సాహమును కరుణపుట్టునట్లు ప్రదర్శించుకొనినాఁడు. సిద్ధునివంటి ఇంద్రియ నిగ్రహముకలవానిని తన 'భాషాపరశేషభోగిత్వముచే' (మాటల నేర్పుచేత) కరిగించి రహస్యమును జెప్పించినాఁడు. తుదకు 'నను మీ శిష్యుని తీర్థయాత్రవలనన్ ధన్యాత్ముగాఁ జేయరే' అని శరణుఁజొచ్చి పాదలేపమును పొంది చిరకాల వాంఛను సాధించినాఁడు. తీర్థయాత్రకై బయల్వెడలి సూటిగ హిమవన్నగమున కేగినాఁడు. అట పాదలేపము కరిగిపోయినపుడు 'ఇమ్మంచు కొండకు రాఁజెల్లునె బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్!' అని తన్నుఁదా నిందించుకొనినాఁడు. కాని అటకేగనిచో తనూకాంతిచే మన్మథమన్మథుఁడైన యితనిని జూచి వరూథిని వలపు గొనుటెట్లు? వలపు విద్యనెల్ల నుగ్గుబాలతో నేర్చిన ఆమెకు లొంగక ధీరుఁడై “ఒడల్ తిరమే చెప్పకుమిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపై తేనియల్" అని పల్కి యుక్తులకన్నిటి కన్ని జెప్పి ధైర్య నిగ్రహముల త్రోసిపుచ్చి విజయముతో తిరిగివచ్చి, జితేంద్రియత్వమునకుఁ బెట్టినది పేరై ప్రశస్తిగనుటెట్లు?
ప్రవరుని తీర్థయాత్రాభిలాష తీరినదా? తీరకేమి? ఏది తరింపఁజేయునో యది తీర్థము. దానికేగుట యాత్ర. హిమవన్నగమున కేగి వరూథినీదర్శనమున ప్రవరుఁడు తరింపలేదా? తరించినాఁడు. అతని తీర్థయాత్రా కుతూహలము ఫలించినది. జితేంద్రియత్వ పరీక్షలో విజయము పొందుటయే యాతని తీర్థయాత్రవలని విచిత్ర ప్రయోజనము."
పెద్దన ఉత్తరకథలో ప్రవరుఁడు ప్రదర్శించిన గుణవిశేషములకు బీజములన్నింటిని ప్రథమాశ్వాస కథయందే నిల్పి, పిదప వానినందంద వెలివిరియించుచు నా పాత్రను పూర్ణాకృతిని రచించి, తన కల్పనాశిల్పమహిమను మనోజ్ఞముగఁ బ్రదర్శించినాఁడు. ఆధునిక విమర్శకుఁడొకఁడు పెద్దనార్యుని ప్రవర పాత్రసృష్టికి ముగ్ధుఁడై ఇట్లు ప్రశంసించినాఁడు.
“జ్ఞాతాస్వాదో వివృత జఘనం కో విహాతుం సమర్థః శృంగారరసాస్వాదనము నెఱిఁగినవాఁడెవఁడు స్త్రీ వలచి వచ్చిన నిలువగలఁడు? - అని కాళిదాసుని సవాలు. దానికి సమాధానముగా 'శాణోపలనిఘృష్ణ భర్మ శలాకనా' (ఒరపిడి రాయిచే బరీక్షింపబడిన బంగారు కడ్డీ) నొప్పు ప్రవరుని నిర్మించినాఁ డాంధ్రకవితాపితామహుఁడు. "ఔరా పెద్దన్నా! నీవు పెద్దన్నవే. నీకును నీ ప్రవరునికిని జోహారులివే”
సాహిత్య విమర్శ
673