Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హృదయానందమును జేకూర్చెడిది. ప్రవరుని సదాచారములకు, క్రతుదీక్షా నిర్వహణములకు నిత్యోత్సాహమును ప్రదర్శించి యీ సోమిదమ్మ సర్వవిధ ధార్మిక దాంపత్య సౌఖ్యము లొడగూర్చునది. ఇట్టి యనుకూల దాంపత్యమునకు సంతాన సాఫల్యమేమైన కలిగినదో లేదో పెద్దన చెప్పినాఁడు కాఁడు. కథాకాలమునాఁటికి లేకపోవచ్చును. అయినను ప్రవరుఁడు ఇంకను జీవత్తాతపాదుఁడు (బ్రతికిన తండ్రి గలవాఁడు) యౌవనుఁడు గదా! 14

ప్రవరుఁడు ధనాఢ్యుఁడు. ఎట్టి కొఱఁతయును లేని గృహస్థు. ఆర్జనతాపత్రయము లేనివాఁడు. అతిశయమైన ఆతిథ్య తత్పరత్వమునకు, క్రతు నిర్వహణమునకు, నిరంతరాధ్యాపనమునకు విశేషధన మవసరము. అతని మాన్యక్షేత్రములు పెక్కు చందాల పండుచుండుటచే నతనికి వీని కన్నింటికవసరమైన ధనమునకు లోపము లేకపోయినది. ఈ కారణముననే అతని కార్జనతాపత్రయమును లేకపోయినది.

దాతలైన యెంతటి మహారాజు లీతని దానప్రతి గ్రహణయోగ్యతను గుర్తించి యీవచ్చిన నితఁడు సాలగ్రామము మున్నుగాఁ గొనకపోవుటయును సంభవించినది.

ప్రవరుని యదృష్టములన్నింటిలో గొప్పది 'జీవ పితరు'లను గల్గియుండుట. సుఖులై వారు 'దేవియున్ దేవరవోలె' నుండి యిలు దీర్చుట యంతకంటె నదృష్టము.

ప్రవరుఁడు సదాచారసంపన్నుఁడు. ఆచారసంపన్నతచే క్రమశిక్షణమును, శమదమాది సద్గుణముల నలవరచుకొన్నవాఁడు. ప్రత్యూష పవనాంకురములు పైకొనువేళ వామనస్తుతి పరత్వమున లేచి నదికేగి స్నానసంధ్యాద్యనుష్ఠానముల ముగించుకొని మడుగుదోతులు గొని సచ్ఛాత్రులు వెంటరాఁగా నింటికేతెంచుట యాతని కాచారము. అట్లు వచ్చుట ప్రజలు మెచ్చుకొనవలెనని గాదు. అన్యులకాదర్శమును జూపుటకు. ఇతరులు మెచ్చుకొనిరన్నచో నట్లొనర్చుట వారికి హృదయపూర్వకమైన మెప్పు కలుగుటవలననే.

నిత్య మధ్యాపనమున శిష్య హృదయముల నలరించుటచేత నాతనియెడ శిష్యసంతతికి భక్తిగౌరవము లతిశయములై యుండు నని యూహించుట యతిశయోక్తి గాదు. అతనికి శిష్యులపై వాత్సల్యమపారమై యుండవలయును.

కర్మిష్ఠి యైన పూర్వమీమాంసికుఁడైనను ప్రవరుఁడు భక్తి కొరవడినవాఁడు కాఁడు. భక్తిభావముతో నతిథులజేరి తీర్థమాహాత్మ్యములు నడుగుట, పోయి చూచిరావలయునని యువ్విళ్ళూరుటయు నిందులకు నిదర్శనములు.


672

వావిలాల సోమయాజులు సాహిత్యం-4