Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కృతివర్ణించినారు. ఇందుల కాంధ్ర సాహిత్య ప్రపంచమున హరిహరనాథుఁ డక్కవిబ్రహ్మ తిక్కన సోమయాజికి దర్శనభాగ్య మొసఁగుట ప్రబల తార్కాణము. 'జోల లాలి' ఇత్యాది నిద్రా సాహిత్యము ప్రతి దేశమున నొక సాహిత్య శాఖయై విలసిల్లుటఁ గన నిద్రకు నిత్య జీవితమున నెట్టి ప్రాముఖ్యమున్నదియు వెల్లడియగుచున్నది. ఈ ప్రాముఖ్యమును గుర్తించియే యొక మాఱు వర్డ్సువర్తు మహాకవి నిద్రాదేవి కటాక్షము తొలఁగినపుడొక కావ్యమిట్లు చెప్పినాఁడు.

111[1]"ఒకదాని వెనుక నొకటి ప్రశాంతముగ గమించునవిగణమును, ఝంకార మొనర్చు తుమ్మెదలను, గ్రిందికిఁ దుముకు వాహినులను, మందమందవాయువు లను, సముద్రమును, మృదులమగు సస్య క్షేత్రములను, నీరపటలములను, స్వచ్ఛమగు నాకాశము నొకదాని వెనుక నొకదానినిఁ గ్రమముగ నూహించితిని. అయినను నిద్రావిహీనుఁడనై నిలువవలసి వచ్చినది. నా పుష్పోద్యానవన తరువులపై నిల్చి కూయు పులుఁగుల కలధ్వనులు కోకిలా కరుణార్ద్రగీతములను వినవలసివచ్చినది. ఈ రీతిగ నిన్నటి దినమును మఱియు రెండు దినములు గడిచినవి. కాని నేను నీపై నే మార్గమున నైన విజయము నొందజాలక పోయినాఁడను. దేవీ! ఈ రాత్రియు నన్నిట్లె వాడిపోనీయకుము. నీవు లేని యుదయకాల సౌభాగ్య మేమున్నది? దినమునకును దినమునకును మధ్య దివ్యమగు నో యంతరమా! నూతన భావములకు నానందకరముగ నారోగ్యమునకుఁ దల్లివగు నో ప్రియమాతా!! రమ్ము!"

వైతాళికుల సాహిత్య మంతయు నొకచోఁ జేర్చిన యందుఁ గొన్ని విశేషములు లుండకపోవు. భారతగాయకలోకము ప్రాభాతిక రమణీయ రాగఫణితుల, నందు ముఖ్యముగ దేశాక్షి భూపాల మలయమారుతాది రాగములు, నిష్టదైవతముల నీ నాఁడును మేల్కొల్పుట యాచారముగనే యున్నది.

ప్రపంచ శిల్పులు యోగనిద్రాముద్రితులైన మూర్తుల శిల్పించినారు. 112[2]ధ్యానీబుద్ధ' 'ప్రజ్ఞాపారమిత' ప్రతిమాశిల్పము లిందు జగద్విఖ్యాత కృతులు. పాశ్చాత్య ప్రపంచమున లీచ్ ఫీల్డు కెథడ్రలులోని నిద్రాదంపతుల శిల్పఫలకము నిద్రాశిల్పమునకు నిస్తులమైన నిదర్శనము.

నిద్ర తాత్త్వికుల దృష్టి నాకర్షించింది. భారతీయ ద్రష్టలు దీనిని స్వప్నయోని, స్వప్నజన్మభూమిగ దర్శించినారు, నిద్రాసమయమున ప్రత్యగాత్మ బుద్ధ్యంతఃకరణతో నుండునఁట! 'ఓ జననీ! నిద్రా! నీవు మా యొద్దనుండి తొలగిపొమ్ము. అశ్వినీదేవతలు

నిన్నతి జాగరూకతతోఁ బరిశీలించుచున్నారు. వారి కంటఁ బడక నీవెట్లు
  1. 111. ఒక దాని వెనుక నొకటి - ఆంగ్లమహాకవి వర్డు వర్తు (క్రీ.శ. 1770-1850) సుప్రసిద్ధ ప్రకృతికవి. క్రీ.శ. 1806లో నిద్రను గూర్చి మూఁడు కావ్యములఁ జెప్పినాఁడు. ఇది యందొక దాని కనువాదము
  2. 112.ధ్యానీబుద్ధ - జ్ఞానము నుపదేశించు బుద్ధమూర్తికి బేరు ప్రజ్ఞాపారమిత జగత్ప్రసిద్ధి నొంది నేఁడు జావాయందున్న యొకానొక బుద్ధమూర్తి

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

67