'మనువులలో స్వారోచిషమనుసంభవము' అన్న పద్యమున 'రస సముంచిత కథలన్' అన్న దానివలన కవితాశిల్పమెంతయున్నను కవితకు ఆత్మరసమను నభిప్రాయము వ్యక్తమొనర్చి, సత్కవి రసవత్కావ్యవస్తువును స్వీకరింపవలెనని పెద్దన సూచించినాఁడు.
'కలి విధ్వంసక' శబ్దముచే కావ్యమునకు 'విశ్వ శ్రేయము' పరమ ప్రయోజనమన్న అభిప్రాయమును వ్యక్తమొనర్చినాఁడు. 'మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పుమనుట'తో ప్రఖ్యాతేతివృత్తమునకుఁ గల బ్రాముఖ్యమును దెల్పినాఁడు. ఈ రీతిగా పెద్దనార్యుఁడు చెప్పకయే కవితాలక్షణోద్దేశాదులను వెల్లడించినాఁడు.
పిమ్మట నొనర్చిన కృతిపతి వంశవర్ణనమున రాయల ప్రతాపాతిశయమును గూర్చియు నాతని కళింగ దిగ్విజయయాత్రను గూర్చియు నెన్నియో విశేషములను దెలిపినాడు.
షష్ఠ్యంతములను నన్నెచోడమహాకవి యారంభించినాఁడు. 1 తరువాతి కవులు అవతారికలలో నొక లక్షణముగఁ గ్రహించినారు. ఈ షష్ఠ్యంతరచనకు కవులందఱును కందమునే గ్రహించినారు. పెద్దనార్యుని షష్ఠ్యంతముల వలన రాయల సైన్యవిస్తృతి, విద్యావిశేషము, కవితాస్త్రీ లోలత, శ్రీవేంకటేశ్వరస్వామి పైఁగల భక్తి మొదలగునంశములు వెల్లడియగుచున్నవి.
ఈ రీతిగా పెద్దనార్యుని మనుచరిత్రావతారికయందు అవతారికలకుఁగల ముఖ్య లక్షణములన్నియుఁ బుట్టినవి. వానివలన చారిత్రక, సాంఘికాది విశేషములెన్నియో వెల్లడియైనవి. 'పెద్దన మహాకవి' యనుటకు ఈ పీఠికా భాగమొక్కటియైనను జాలియున్నది.
ప్రవరుఁడు
ప్రవరుని పాత్ర సకలాంధ్ర సాహిత్యమునందును నొక యపూర్వ సృష్టి. మనుచరిత్రకు విఖ్యాతిని గడించియిచ్చిన విశేషాంశములలో నొకటి. కవితా ప్రపంచమున పెద్దనను పెద్దన్నను గావించిన సృష్టి. నీవీబంధమోక్షమే (పోకముడిని విప్పుట) మోక్షమని వాదించు శృంగార రసవాదులైన కవులను సిగ్గిలఁజేయునట్టి ధర్మప్రతిపాదకమైన పాత్ర. పెద్దనను కావ్యసృష్టి మూలమున ధర్మప్రవర్తన మొనర్చినవారిలో నొక యగ్రేసరునిగ నిల్పిన పాత్ర.
సాహిత్య విమర్శ
669