Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వర్ణించినాఁడు. దేవతాకాంతలను పాదములు మొదలు శిరము వఱకును వర్ణింపవలయునను ధార్మిక మర్యాదకు భిన్నముగ, శిరమాదిగ పాదముల వఱకును వర్ణించుట గమనింపఁదగియున్నది. ఇంతటితో దేవతాస్తుతిని ముగించి పెద్దన గురుస్తుతి యొనర్చినాఁడు. ఈ గురుస్తుతి వలన రాయల కాలమున శఠకోపయతి యను నొక వైష్ణవగురువరేణ్యు డున్నట్లు వ్యక్తమగుచున్నది.

ఈ యంశము కోకట గ్రామ దానశాసనముల వలన రూఢియగుచున్నది. ఇట్లు దేవగురు దేవతాస్తుతులొనర్చుట అవిఘ్న పరిసమాప్తికి. అది మానసికముగాఁగాక కృత్యాదిలోఁ బ్రవేశపెట్టుట యేల యనఁగా శిష్యులకు నేర్పుటకు ('శిష్య శిక్షాయై) అని సమాధానము.

గురుస్తుతికిఁ బిమ్మట పెద్దన అవతారికాది లక్షణములలో నొకటైన 'పూర్వ కవిస్తుతి' అను నియమమును బాటించి పూర్వకవులకుఁ బురస్కారమొనర్చినాఁడు. ఇందు తొలి దేవభాషా కవులైన వాల్మీక్యాదులను స్తుతించి పిమ్మట కవిత్రయస్తుతి యొనర్చినాఁడు.

తిక్కనను 'కృతక్రతు' అని పల్కి క్రతువులపై దనకుఁగల యభిమానమును బ్రకటించినాఁడు. ఈ కవిస్తుతులను బట్టి పెద్దన యిందు బేర్కొనిన కవీశ్వరుల గ్రంథజాలము నెల్ల సమగ్రముగఁ జూచినవాఁడని యూహింపవచ్చును. ఇందు తన కభిమానకవియును, కవిసార్వభౌముఁడు నైన శ్రీనాథుని గూర్చి చెప్పకపోవుట విశేషము. బహుశా పెద్దనార్యుని కాలమున కింకను శ్రీనాథుఁడు నవీనుఁడుగా భావింపఁబడుచుండెడివాఁడేమో!

పిమ్మట మనుచరిత్రలోని యవతారికాభాగమునఁ గన్పట్టు నంశము కుకవినింద. 'సుకవిస్తుతి యొనర్చినచో పరిశిష్టన్యాయమున కుకవినింద యొనర్చినట్లే, కాని రెండును కృత్యాదుల నుండవలె ననునది తెలుఁగు కావ్యావతారికలలో కాలక్రమమున నియమముగానైనది. నన్నయ సరసకవిసభలను వర్ణించి యూరకొనినాఁడు.

నన్నెచోడుఁడు కుకవినింద నారంభించినాఁడు. దేశికవితావిజృంభణము వలన సత్కవిత్వ మెద్దియో, కుకవిత్వమొద్దియో తెలిసికొనని కాలమగుటచే, 'కవిబ్రహ్మ తిక్కన సోమయాజికిని కుకవి నింద యొనర్చుట యవసరమై, దానిని తన నిర్వచనోత్తర రామాయణమున “పలుకుల పొందులేక”... ఇత్యాది యందు రమణీయ మార్గమున కుకవినింద యొనర్చినాఁడు. ఇది తరువాత ప్రబంధములందు సంప్రదాయమైనది. పెద్దన కాలమున రాజసభలలో కవితకు విశేష గౌరవమును, దానివలనఁ


సాహిత్య విమర్శ

667