Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సువర్ణంబు సేయు కరణిన్ ధరణిన్" అని చెప్పినాఁడు. పెద్దన 'శ్రీ వక్షోజ' యని కృతి నారంభించుటచే కృత్యాదిని 'శ్రీ' కారముతో నొనర్చుటయును పాటించినట్లయినది. కావ్యాదిని 'మగణము' శుభదాయకమను శాస్త్ర వాక్యమును గూడ పాటించి, పెద్దన మగణముతో నారంభమగు శార్దూలవృత్తమును కావ్యారంభమొనర్చుటయును గమనింపఁదగియున్నది.

మంగళాచరణపద్యములలో 'శ్రీ వక్షోజకురంగనాభము', 'ఉల్లమునందు నక్కటిక మూనుట' 'నాలుగు మోములున్' అనువానియందు పెద్దన క్రమముగా హరి, హర, బ్రహ్మలను స్తుతించి నాఁడు. ఇందు 'బ్రహ్మ'ను గూడ స్తుతించుట విశేషము. బ్రహ్మ,త్రిమూర్తులలో నొకఁడైనను పంచాయతన దైవతములలోని (సూర్యుఁడు, శక్తి, విష్ణువు, శివుఁడు, గణనాథుఁడు వీరివలన సౌరము, శాక్తము, వైష్ణవము, శైవము, గాణాపత్యములను మతము లుద్భవిల్లినవి - బ్రాహ్మమను మతము లేదు) వాఁడు కాఁడు. ""కన్నడమున గదాయుద్ధమును జెప్పినారన్న కవిబ్రహ్మను, మన్మథుని గూడ స్తుతించినాఁడు. నన్నయభట్టు 'హరిహరగజాననార్కషడాస్యమాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికి నమస్కృతిసేసి' కావ్యారంభ మొనర్చినాఁడు.

నన్నెచోడుఁడు మన్మథుని గూడ స్తుతించినాఁడు. రాయలకాలముననున్న కన్నడ కవులు కన్నడ సంప్రదాయముననుసరించి బ్రహ్మను గూడ స్తుతించుటచే, పెద్దనయు పంచాయతన దైవతములలోని వాఁడు కాకున్నను బ్రహ్మను స్తుతించియుండవచ్చును.

ఇట్లు పెద్దన శివబ్రహ్మలను స్తుతించుటచే విష్ణు పారమ్యమునే పల్కు వైష్ణఁవుడు కాఁడేమోనన్న యనుమానమును గూడ గల్పింపఁగా, స్మార్తులతోఁ గొన్ని లౌకిక కారణములచే శ్రీవైష్ణవులవలెఁ బూర్తిగా భోజన ప్రతిభోజనాదులను వదలుకోచాలక యున్న ఇప్పటి గోల్కొండ వ్యాపారి వైష్ణవులవంటి వైష్ణవుఁడే మన పెద్దన్నగారు. స్మార్త సంఘమునందలి పామర సామాన్యాచారము ననుసరించి మనుచరిత్రమున నిష్టకామ్యార్థ సిద్ధికై పెద్దనార్యుఁడు బ్రహ్మరుద్రాదులను స్తుతించెను. 'కేవల ముముక్షువులయందు దప్ప నిది దోషము కాదు' అని సమాధానము గూడఁ జెప్పఁబడినది. (ఆముక్తమాల్యద - వీర వైష్ణవము - శ్రీ. గో. రమాకాంతాచార్యులు భారతి వృష - ఆశ్వయుజము).

త్రిమూర్తుల స్తుతించిన పిమ్మట పెద్దనార్యుఁడు విద్యాబుద్ధులకధిదేవతయు,విఘ్నాధిపతియునైన గజాస్యుని గొల్చినాఁడు. గణాధిపస్తుతిపూర్వకమైన అర్ధనారీశ్వర వర్ణనమైన యీ పద్యము మిక్కిలి మనోజ్ఞమైనది. పిమ్మట పెద్దన సరస్వతిని


666

వావిలాల సోమయాజులు సాహిత్యం-4