Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తామ్రశాసనము క్రీ.శ. 1511 నందును రాయలు చంద్రవంశార్గతమైన తుర్వసువంశమువాఁడని తెలియఁజేయుచున్నవి.

సాళువ నరసింహరాయల కాలమున (క్రీ.శ. 1486-90) బుట్టిన వరాహపురాణమున తుళువ వంశమునకు మూలపురుషుఁడు తిమ్మరాజని అతఁడు తుళు దేశస్థుఁడని మాత్రమే యున్నదిగాని, చంద్రునిప్రసక్తి గాని, తుర్వసులను ప్రసక్తిగాని లేఁదు. దీనినిబట్టి తుళువరాజులు క్షత్రియులుగారని తెలియుచున్నది. ఈ తుళువలలో సాళువ ఇమ్మడి నరసింహుని జంపించి (క్రీ.శ. 1506న) రాజ్యాభిషిక్తుఁడై మహారాయ బిరుదము నొందిన మొదటివాఁడు - కృష్ణదేవ రాయల సోదరుఁడైన వీర నరసింహరాయలు. ఇతని కాలముననే తుళువ వంశజులకు క్షత్రియత్వ మాపాదింపఁబడినదని చరిత్రజ్ఞుల యభ్యూహము.

ఒకవేళ తుళువలు క్షత్రియులని యంగీకరించినను, కృష్ణరాయల తల్లియైన నాగలాదేవి తండ్రియైన నరసనాయకునకు కులవధువుగాక, భోగకాంతయని బహుళముగాఁ బ్రచారమునున్న గాథనుబట్టి, రాయలు క్షత్రియుఁడని చెప్పుట కవకాశము లేదు. (కృష్ణరాయలు - శ్రీ నేలటూరి - భారతి సర్వధారి ఫాల్గునము పు. 159-160).

పెద్దనార్యుఁడు తిమ్మరాజు పుత్రుఁడైన ఈశ్వరరాజును ఘనముగఁ బొగడినాఁడు (ప. 25, 26). ఈ ఈశ్వరరాజు విజయనగరాధిపతియైన సాళువ నరసింహరాయల (క్రీ.శ. 1485-1490) సేనాపతి. కొండవీటి పైకెత్తి వచ్చుచున్న మహమ్మదు షా బహుమనీని ఓడించి తగిన ప్రతీకారమొనర్చుటకు రాయ లీతనిని నియమింపగా, నీతఁడు కందుకూరుకడ నాతని నోడించి ఖండించి, కంచినుండి యాతఁడు కొల్లగొట్టికొనివచ్చుచున్న ధనమును గ్రహించినాఁడు. (కళింగ జైత్రయాత్ర భారతి వికృతి, చైత్రము పుట. 413)

పెద్దనార్యుఁడు ఘనముగ వర్ణించిన (ప 29,30) కృష్ణరాయల తండ్రియగు నరస ప్రభుఁడును గొప్పవాఁడే. ఇతఁడు సాళువ నరసింహుని సర్వసేనాధిపతి. ఇతఁడు సాళువ నరసింహుని పుత్రులగు తిమ్మరాజ, ఇమ్మడి నరసింహరాజుల కాలమున పేరుకుమాత్రము వారినే చక్రవర్తులనుగా నిల్పి, 'సంరక్షకుఁడై' క్రీ.శ. 1490-1506 మధ్యకాలమున విజయనగర రాజ్యమును నిరాటంకముగఁ బాలించినవాఁడు.


660

వావిలాల సోమయాజులు సాహిత్యం-4