పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నుజ్జ్వలమగు నంపశయ్య పర్యంకమైనది. మఱియొక మహారాజునకుఁ బట్టజశయ్య శయనీయమై యెప్పియుండును. జగత్కారణుఁడు వటపత్రశాయి శేష తల్పశాయి. ప్రాచీన భారతీయ చక్రవర్తులలో సౌవర్ణ పట్టజ కీటజాండజశయ్యల నిర్మించుకొని యనుభవించినటులఁ దెలియుచున్నది. శయనసంవేశనము ప్రాచీన శృంగార చతుష్షష్టిలో నొకటైనను 'నాగరకవృత్తము' వలన నభివ్యక్త మగుచున్నది. మాగధ, వైతాళిక, సౌఖశాయనికాది భృత్యుల వనలఁ గల పరమ ప్రయోజనము నర్థ శాస్త్రాభిజ్ఞు లెఱిఁగి యుండుటచే, రాజ ప్రాసాదములందు వారి యావశ్యకతను నిరూపించి యున్నారు.

నిద్రకును గొన్నినియమములున్నవి. 'భుక్త్వాశతపదం గచ్ఛేత్, నామపార్శ్వేన సంవిశేత్' అని 109[1]సుశ్రుతము. దక్షిణపుఁ దలాపి యొకధర్మము. నిద్రారంభవేళ నది మృత్యుతుల్య మగుటచే అగస్త్య కపిలాస్తీకాది పుణ్యపురుష స్మరణము, ప్రహ్లాద నారద పరాశర పుండరీకాది చిరంజీవుల పరిగణనము లావశ్యకములని యార్యుల నమ్మకము. ఆంజనేయ దండకమును బఠించుచుఁ గాక నిదురింప నిచ్చగింపని ప్రాచీన మర్యాదను బాటించు నాంధ్రులు నేఁటికిని గన్పించు చున్నారు. పాశ్చాత్య దేశములందు నిట్టి యాచారము లేకపోలేదు. థామస్ బ్రౌన్ "భగవత్రార్థనము లేక నేనెన్నఁడును నిదురింప”నని పలికినాఁడు. వామనస్తుతి పరత్వమున నిదురలేఁచుట యే నాఁటి యాచారమో యేమో! 'ఇంతింతై వటుఁడింతయై మఱియుఁదా నింతై' తుదకుఁ ద్రిజగముల నిండిన త్రివిక్రముఁడు వామనుఁడు, ఆయనను స్తుతించుటవలన నా రీతి వృద్ధినొందు కోర్కె యీ స్తోత్ర పాఠకులందును ద్యోతకమగుచున్నది.

పొడగరితనమునకు, నిద్రకును సన్నిహిత సంబంధ మున్నదని శాస్త్రజ్ఞు లంగీకరించినారు. ఆర్థరు రేనాల్డు అనునొక పరిశోధకాగ్రేసరుఁడు “నూరు దినములు నిద్రపోకుండునట్లుగ నిల్పుటచే విద్యార్థుల రయంగుళము తగ్గిపోవుట తటస్థించిన” దని చెప్పినాఁడు. నీల్ జహార్ అను శాస్త్రజ్ఞుఁడు "నిద్రాసమయమున మస్తిష్కము తగ్గుటయును, శరీరము వృద్ధి నొందుటయు జరుగు" నని తన పరిశోధన ఫలితమును వెల్లడించినాఁడు.

కళాకారులను నిద్రాసౌందర్య మాకర్షించినది. సాహిత్యోపాసకులు తమ కావ్యముల "స్వప్న సుందరులఁ" జిత్రించినారు. 110[2]అవంతి సుందరి యందగ్రగణ్య. విఖ్యాతరచయితల యమూల్యకల్పనా విన్యాసములకు నిద్రావస్థ యుపోద్బలక మైనది.

పురాణ కవులకుఁ గృతిపతులైన దేవతా మూర్తులు నిద్రాసమయములందుఁ గన్పించి
  1. 109. సుశ్రుతము - సుశ్రుతాచార్య రచితమైన వైద్యశాస్త్రము
  2. 110. అవంతి సుందరి - దండి దశ కుమారచరిత్రమున నొకపాత్ర

____________________________________________________________________________________________________

66

వావిలాల సోమయాజులు సాహిత్యం-4