మాటిమాటికి నా జయస్తంభమందలి లేఖనమును కళింగరాజైన వీరభద్రగజపతి యపకీర్తియనెడి కాటుకను బూసి చదువుచుందురు.
శ్రీకృష్ణరాయలకడ కాయారాజులు పంపిన రాయబారులు కానుకలుగాఁ గొనివచ్చిన భద్రగజములను, ఉన్నతాశ్వములతోడ నుంచుకొని శ్రీకృష్ణరాయల దర్శనము లభింపకపోవుటచే నగరివాకిట నిల్చి, ప్రొద్దుననుండి సాయంకాలము వఱకును ప్రతిదినము దర్శనమునకై సమయమును సంపాదింప వేచియుండెదరు.
యుద్ధములందు కృష్ణరాయలచే నఱుకఁబడిన యేనుగుల కుంభస్థలములనుండి వెల్వడెడి క్రొమ్ముత్తెము లాతని ఖడ్గధారయను ప్రవాహమున శత్రువుల పుట్టిమునుఁగగా నురువుపిండుతో వెడలు నీఁటి బుడగలవలెఁ గన్పట్టును.
కృష్ణరాయలు దాటి భయంకరమైనది. అతఁడు దాడి వెడలునప్పుడేన్గులు తుండములతోఁ జిమ్ము తుంపురులును, నవి చెవులు వీచుకొనుటచే రేఁగెడు దుమ్మును, గుఱ్ఱముల ముక్కులనుండి జాఱు మలమును, భటులు ప్రయోగించు నీటెల దెబ్బలను, నాతని శత్రురాజుల ప్రతాపాగ్ని జల్లారుటకై పైజల్లు నీరుగను, చేటలతోఁ గప్పుమన్నుగను, పైగప్పు బురదగను, అటుపిమ్మట ధరించునట్టి కఱ్ఱలదెబ్బలుగను నొప్పుచుండును.
రాయలశ్వవిద్యయందు మిక్కిలి కుశలుఁడు. దిగంతములవఱకును వ్యాప్తినొందించిన స్వచ్ఛమగు కీర్తి గలవాఁడు. ఎడతెగక గుంపులు గుంపులుగాఁ దోతెంచు గుఱ్ఱముల గిట్టల త్రొక్కుడుచే రేగిన ధూళియను చీఁకటిలో తబ్బిబ్బులుపడు శత్రురాజుల ప్రాణముల నాతని ఖడ్గ మనెడి సర్పమపహరించుచుండును. కృష్ణరాయఁడు ఆ కాలమున దాతృత్వమునకు కీర్తికెక్కిన కర్ణునితో తుల్యమైన దాతృత్వముగలవాఁడు. పండితజన విధేయుఁడు. కవితాస్త్రీలోలుడు. దిక్పాలురకును సహింపరాని పరాక్రమాకాంతిచే మాటుపరచిన సూర్యుఁడు కలవాఁడు. అరనిమిష కాలమునఁ గళింగ రాజపుత్రుని బందీగాఁ బట్టుకొనినట్టివాఁడు. దయానిలయుఁడైన వేంకటేశ్వరుని పాదపద్మస్మరణము గలవాఁడు (వేంకటేశ్వర భక్తుఁడు. వేంకటేశ్వరు నిష్టదైవతముగాఁ గలవాఁడు).
మనుచరిత్ర పీఠిక - చరిత్రాంశములు
ప్రాచీనాంధ్రసాహిత్యము విశేషముగా రాజాశ్రయమువలనఁ బెంపొందినది. మహాకవులైన నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథ, పెద్దనాదులు రాజాస్థానకవులై వర్ధిల్లి
658
వావిలాల సోమయాజులు సాహిత్యం-4