దయారసమునకు సముద్రుఁడు. ఇతఁడు ఈ రీతిగాఁ జెప్పఁబడుచు లోకములలో విఖ్యాతి నొందెను.
తిమ్మరాజపుత్రుఁడైన ఈశ్వరరాజునకు పుణ్యచిత్తయైన బుక్కాంబకును పరాక్రమమున సూర్యులును, బుద్ధిశాలురునైన నరసింహరాజు, తిమ్మరాజులను నిర్వురు పుత్రులు జనించిరి. వారిలో నరసరాజు శ్రీగంధముతోను, కల్పవృక్షముతోను, మల్లెలతోను, వెన్నెలతోను, సమానమైన తన స్థిరకీర్తిచే దిక్కులనన్నింటిని నింపినవాఁడై సమస్త పాపములను నశించునట్లుగా భూమిని పాలించెను. ఇతఁడు లక్ష్మీసంపన్నతచే విష్ణువును, ఐశ్వర్యముచే శివుని, బుద్ధిచే బ్రహ్మను, జయించు స్వభావముచే కుమారస్వామిని, రూపముచే మన్మథుని, శక్తిచే వీరభద్రుని, కాంతిచే చంద్రుని, ధైర్యమున మైనాకపర్వతమును, చేవచేత రాహువును, భోగములచే నింద్రుని బోలినవాఁడై యొప్పెను. వాడియైన తన కత్తిచే శత్రురాజుల శిరములను ఖండించియా శిరములతో మాలికలు గ్రుచ్చి ఆ అలంకారములతో శివునర్చించు నీ నరసరాజు, సముద్రమునే కట్టు వస్త్రముగాఁగల భూమిని దన బాహుపురియందు మరకతముగా నొనర్చెను. ఎడతెగని దానధారావర్షమునకుఁ గవిసమూహములను చాతకపక్షుల గావించెను. దిక్కుల మధ్యనున్న సమస్త రాజసమూహమును తన కాలి గండపెండేరమున బొమ్మలను గావించెను. పూజార్హమైన తన స్వచ్ఛమగు కీర్తికి ఆకసమును రాజహంసగా నొనర్చెను.
ఆ నరసరాజుకు తిప్పాంబ, నాగాంబ అనునిర్వురు భార్యలు గలరు. వారివలన నీ నరసరాజు వీరనరసింహరాయఁడు, కృష్ణరాయఁడు నను నిర్వుర కుమారులను పొందెను. అందు కృష్ణరాయలు విష్ణ్వంశసంభవుఁడు. ఇందు వీరనరసింహుఁడు కరవాలముచే విరోధుల నందఱ ఖండించి ఏకచ్ఛత్రాధిపత్యముగ సమస్తభూమిని నిరాటంకముగఁ బాలించెను.
శ్రీకృష్ణరాయ ప్రతాపాది వర్ణనము.
వీరనరసింహరాయల యనంతరము కృష్ణరాయలు చిన్నాదేవియును, తిరుమలదేవియును తనకుఁ గూర్చునట్టి (ప్రియమగునట్టి) దేవేరులు కాఁగా భూభారమును వహించెను. ఈ కృష్ణరాయలు భూమండలమును బాలించుచుండఁగా ప్రజలందఱును సుఖించిరి. సకాలము నందు వర్షములు కుఱియుటచే భూమి సస్యసమృద్ధిచే రాణించెను. ప్రజాజీవితము సౌఖ్యవంతమయ్యెను. వేయేల, కృష్ణరాయల పాలనమున ప్రజలు రామరాజ్యమునందువలె సుఖించిరి. అంతవఱకును నెడతెగక
656
వావిలాల సోమయాజులు సాహిత్యం-4