Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీనిని బట్టి కధైక్యము లేదను విమర్శకవాక్య మసత్యమనియును, సామాన్య ప్రబంధములకంటె విస్తృతమైన కథయున్నదనుట యోగ్యమనియును తేలుచున్నది.

కొందరు విమర్శకులు మనుచరిత్రమున రసాభాసదోష మున్న దనుచున్నారు. ఏకపక్షాను రాగము రసాభాసము. మనుచరిత్రమందలి ప్రధానకథయైన వరూధినీ వృత్తాంతమునందలి పూర్వార్ధమున ననురాగము వరూధినియందు మాత్రమే యున్నది. మాయాప్రవర వృత్తాంతమునందు పరస్పరానురాగమున్నట్లు పాత్రలు పొడగట్టునుగాని, రసము సామాజిక నిష్ఠమైయుండుటచే నిటను రసాభాసమే కన్పట్టుచున్నది.

ఈ రసాభాసము పురాణములోని కథయందేయున్నది. కవి దానిని తప్పించుట యెట్లు? తప్పింప యత్నించినచో ప్రవరునకుఁ బతనము సంభవించును. కథయందు రసాభాసము వర్ణితము కారాదని నియమము లేదు. ప్రాచీనాలంకారికులును దీనినుపాధేయముగఁ జెప్పియున్నారు. కాని ప్రపంచ సాహిత్యమున ఏకపక్షానురాగము గల కథావస్తువులతో గూఁడిన కావ్యములెన్నియో అనన్యసామాన్యములైన మహాకావ్యములుగఁ బరిగణింపఁబడుచున్నవి.

పెద్దనార్యుఁడు శృంగారము నంగిరసముగా గ్రహించి వరూథినీవృత్తాంతము నందలి శృంగారమును ఎట్టి లోపము లేకుండ పోషించినాఁడు. రతిస్థాయికమైన వరూధిని చరిత్ర శృంగారపర్యవసాయి అగుటకు కథాధర్మమును బట్టి గాని యవకాశము లేదు. కావున 'రసాభాస' మును దోషముగ జెప్పి, దానిని పెద్దనార్యుని కావ్యమున నొక లోపముగా నెన్నుట రసజ్ఞత కాకపోవుటయే గాక, అనుచితమును, అసమంజసమును.

పాదలేప వృత్తాంతమునను, ప్రవరుని హిమవన్నగయాత్ర విషయమునను స్వల్పమైన కాలమునకు సంబంధించిన దోషమును కొందరు విమర్శకులు చూపుచున్నారు. కుతపకాలమున వచ్చిన యోగి భోజనాదికమును ముగించుకొన్న పిమ్మట ప్రవరునితో సంభాషించి తుదకు అతని పాదములకు పాదలేపమును పూసి వెళ్ళిపోయినాఁడు. ఆ సందర్భమున ప్రవరుఁడు హిమవన్నగమును జూడఁబోయినట్లున్నది. తఱువాత మధ్యాహ్న వర్ణనమున్నది. 'ఈ సందర్భమున ప్రవరుఁడు సాయంతనవేళ హిమవన్నగమున కేగినచో మఱల మధ్యాహ్న మగుటెట్లు? మఱుసటినాఁడుదయమున వెళ్ళినాఁడన్నచో పొసఁగునని కొందఱు సమాధానము జెప్పినారు. అవకాశము లభించిన తీర్థసందర్భనాభిలాషి


648

వావిలాల సోమయాజులు సాహిత్యం-4