Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెద్దనార్యుని శైలికి ముగ్ధులై మనుచరిత్రమునకుఁ బ్రతిబింబములనఁదగిన ప్రబంధములను తరువాతి కవులు కుప్పతెప్పలుగాఁ జెప్పిరి. వానియందు మనుచరిత్రలోని పద్యములతోఁ బాలికగల పద్యములు, కల్పనలు, భావానుకరణములు కొల్లలుగాఁ గన్పట్టుట మనుచరిత్రకుఁగల గుణాధిక్యమునే వెల్లడించును.

మనుచరిత్ర - దోషములు

ప్రబంధములందు సర్వసామాన్యముగ కథ శృంగార ప్రధానమై ఐక్యము కల్గియుండును. కథావిషయమున మిగిలిన ప్రబంధ సామాన్యములకును, మనుచరిత్రమునకును గొంత భేదమున్నది. ఇందలి కథ సామాన్యముగఁ బ్రబంధములలోఁ గన్పట్టు కథలకంటె విస్తారమై యున్నది. ఈ కారణముచే నిది ఏకనాయకము కాదనియును, కధైక్యము (Unity of Plot) లేదనియు, నిదియొక దోషమనియును కొందరు విమర్శకులు భావించుచున్నారు.

కాని మనుచరిత్ర కథయందు కథైక్యము లేదనుట అసత్యము. అంతకంటె నితివృత్తము (Plot) - కథావస్తువు - విస్తృతమైనదనుట కొంత సత్యము. ఇందు కధైక్యము లేదను దోషమునకు సమాధానముగా శ్రీ పింగళి ఇట్లు అభిప్రాయపడుచున్నారు.

"ఇందు కథలో నైక్యము లేకపోవుట అసత్యము. అంతకంటే నితివృత్తము విస్తృతమైనదనుట కొంత నిజము. ఆ విస్తృతియైనను అనావశ్యకముగా జరిగినది కాదు. స్వారోచిషమనుసంభవ మనెడి నిర్వహణమునకు ఏయే కథాంశములు పూర్వ పూర్వ కారణకలాపములుగా ఆవశ్యకములో కవి వానినే సూత్రించెను గాని అనావశ్యకమైన ఏ సందర్భమును మార్చలేదు. ఏ ఘట్టమును పరిశీలించినను ఉపసంహార ప్రవణముగానే యుండును గాని తద్విరుద్ధముగా ఉండదు. అట్టి ఏకసూత్రతయే కధైక్యమును సాధించెను.” ధర్మరక్షాప్రవణుఁడైన స్వారోచిషునికి మను పదమున కావశ్యకమైన ధర్మనిష్ఠాగరిమ సంక్రమించుటకు వరూథినీప్రవర మాయాప్రవర వృత్తాంతము లవసరమైనవి. ప్రవర వరూథినీవృత్తాంతమునకు కథను ప్రవర శీలవర్ణనముతో నారంభించుట యావశ్యకమైనదని దీని యభిప్రాయము. ఇందు ప్రథమాశ్వాసమందలి కథయు సత్యావశ్యకమని తెల్పుచు శ్రీ పింగళి 'మనుసంభవమునకుఁ బ్రథమ కారణమైన ప్రవరుని చరిత్రయే లేకున్నచో కావ్యమునకు బీజమే యుండదు' అని అభిప్రాయము నిచ్చినారు.


సాహిత్య విమర్శ

647