ఈ కథాభాగమునందలి 'ఎన్ని భవంబులన్ గలుగు నిక్షుశరాసన సాయక
వ్యథాభిన్నత వాడి' ఇత్యాది సంభాషణములు ప్రతిపదరసోదయములై
యొప్పుచున్నవనుట నిస్సంశయము. తలంచిన కొలదిని పెద్దనార్యుని సంభాషణలు
తలపు లూరించుచుండుననుట సత్యము. సిద్ధ ప్రవర సంభాషణమునందు పరిణతమైన
సంభాషణ విరచనాకౌశలము గన్పట్టుచున్నది. తన తీర్థయాత్రాకుతూహలమును
వెల్లడించుట కారంభించినది మొదలుగ, 'నను మీ శిష్యుని తీర్థయాత్రవలనన్
ధన్యాత్ముగాఁ జేయరే' యని సిద్ధుని శరణు జొచ్చునంతవఱకును, ప్రవరునిచే
పెద్దనార్యుఁడు అతని వినయసౌశీల్యాది గుణవిశేషములు, భక్తిభావము వెల్లడియగునట్లు
వివిధాంతరములతో (నిఃశ్రేణులతో) సంభాషింపఁజేసినాఁడు.
ఆతని సంభాషణమునకు ముగ్ధుఁడై సిద్ధుడుఁ పరమంబైన రహస్యమగు పాదలేప
వృత్తాంతమును దెల్పుటయే గాక, దానిని ప్రసాదించునంతవఱకును లొంగి
పోయినాఁడా యన్నట్లు ప్రవరునిచేఁ బల్కించినాఁడు.
సిద్ధుఁడొనర్చిన సంభాషణమునందును ఆత్మశక్తి నెఱిఁగిన అహంకారము గాని
ఆత్మవిశ్వాసము, విజ్ఞానాధిక్యము, శిష్య జనానురాగము, లోకానుభవము మొదలైన
గుణవిశేషములను ప్రదర్శించినాఁడు. తన ఆశ్రమధర్మముపై నభిమానమున్నను
గృహస్థాశ్రమాధిక్యమును గుర్తించి, 'కెలఁకులనున్న తంగెటి జున్ను గృహమేధి'
ఇత్యాదిగాఁ బలుకుటయును పెద్దన ఔచితీపోషణతోను, ఆశ్రమస్థాన
ధర్మవేతృత్వముతోను గూడిన సంభాషణ విరచనాప్రావీణ్యమును వెల్లడించుచున్నది.
పెద్దనార్యుని సంభాషణలందు ఆ మహాకవి అపూర్వ విజ్ఞానలోకజ్ఞతలు వెల్లడి
యగుచున్నవి.
పెద్దనార్యుని సంభాషణ విరచనమునందును నాటకీయ తాటస్థ్యము
కన్పట్టుచున్నది. పాత్రలన్నిటి సంభాషణలు విశిష్టములు, సమయోచితములు,
స్వభావోచితములు.
వర్ణనవిశేషములు
మనుచరిత్ర మహాకావ్యమునకు సౌభాగ్యమును చేకూర్చిన గుణవిశేషములలో
వివిధ వర్ణనకౌశల మొకటి. ప్రబంధము వర్ణన ప్రధానమను నంశమును బలవంతముగ
మనమునఁ బెట్టుకొని వర్ణించుట యిందుఁగన్పట్టదు. ఈ వర్ణనలలో పెద్దనార్యుని
మానవప్రకృతి - బాహ్యప్రకృతి, అంతరిక ప్రకృతికి సంబంధించిన పరిజ్ఞానము
642
వావిలాల సోమయాజులు సాహిత్యం-4