చెప్పుటలో నెట్టి నైపుణ్యమును ప్రదర్శించినా రనునదియే మనము గమనింపవలసిన యంశము.
మారన మార్కండేయ పురాణమున 150 పద్యములలో నున్న కథను 800 పద్యములుగ రసవత్తరముగఁ బెంచి చెప్పుటలో, పెద్దన మహాకవి కథాకథన వైశద్యము వ్యక్తమగుచున్నది. పెద్దనార్యుఁడు స్వారోచిషమనుసంభవ కథను ప్రవరుని చరిత్రతో నారంభించుటలోనే యొక వైశిష్ట్యము, కథాకథన పథకమందలి దూరదృష్టి కన్పట్టుచున్నవి.
స్వారోచిషుఁడు మనువు. 'మనువులు భువనరక్షాదక్షులు. తేజోనిధులైన ధర్మస్వరూపులు. మానవలోకవాసులయ్యును మానవాతీతులు. దేవాంశసంభూతులు.స్వారోచిషునకు మనుత్వము నొసగఁగలిగిన యట్టి అర్హతలు అతని జనకుఁడైన స్వరోచినుండి అతనికి సమగ్రముగా సంక్రమించుటకు తాత్త్వికముగా అవకాశము లేదు.
స్వరోచి వరూథిని వలె దేవతాంశసంభూతుఁడే; భువనరక్షాదక్షతగల శౌర్యవంతుడే. అయ్యు లోకమును ధర్మమార్గమును నయింపగల ధర్మస్వరూపుఁడు కాఁడు. అతఁడు కామస్వరూపుఁడైన వ్యసని. బాల్యముననే భక్తివైరాగ్యసంపన్నుఁడై చిరకాల తపశ్చర్యవలన శ్రీమహావిష్ణువును సాక్షాత్కరింపజేసుకొనిన స్వారోచిషుని ఆధ్యాత్మిక సంపద, ఆ తండ్రివలన సంక్రమింపనపుడు మరియెక్కడనుండి వచ్చియుండును? స్వారోచిషుని మనుపదమునకు అవసరమైన ధర్మనిష్ఠాగరిమ తల్లిదండ్రుల నుండి కాక, వారి తల్లిదండ్రులనుండి సంక్రమించినది. స్వరోచి జననీజనకులు వరూథినీ మాయాప్రవరులు గదా! ఈ జంటలో తల్లి యొక్క సౌందర్యము ప్రణయ స్వభావము స్వరోచిలో అచ్చుపడి, అతనిని తల్లిపోలిక కొడుకుగా బరిణతి నొందించెను. ఇక మాయాప్రవరుఁ డీతని పుట్టుకకు నిమిత్తమాత్రమే గాని తాత్త్వికమైన జనకత్వము అతనికి లేదు. అట్టి జనక స్థానమున నున్నవాఁడు ప్రవరుఁడు. అనన్య మనస్కురాలై - తదేక ధ్యానముతో ఆ బ్రాహ్మణ కుమారుని ఆరాధించిన వరూథిని గర్భధారణవేళ తాల్చిన తేజ మా బ్రాహ్మణునిది. అతని పవిత్రతయు, నతని యాధ్యాత్మికతయు స్వరోచికి సంక్రమింపవలసి యుండెను. ఆ గుణసంపద అతనిని త్రోసిపుచ్చి అతని కుమారుడైన స్వారోచిషునకు సంక్రమించెను. లోకములోఁ గొందరు తండ్రుల గుణములతోను, కొందరు తాతల గుణములతోను జనియించుట,స్వాభావికమే. ఈ రహస్యము జీవశాస్త్ర న్యాయమునను (Law of Biology) సమ్మతమే.
638
వావిలాల సోమయాజులు సాహిత్యం-4