Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ మార్గములనే యనుసరించి కొందఱు కవులు పురాణకథలను గైకొని స్వకపోకలకల్పనలఁగూర్చి అష్టాదశ వర్ణనలతో మిశ్రప్రబంధము లొనర్చినారు. అట్టివారిలో శ్రీనాథునకుఁ బిమ్మట ప్రసిద్ధుఁడు పిల్లలమఱి పినవీరభద్రుడు. 'ఉత్పాద్య'మైన కథావస్తువు (కల్పితమైన కథావస్తువు) నకు ఆ కాలమున నెట్టి గౌరవమును లేదనుట, యీతని శృంగార శాకుంతలములోని -

శా. ప్రఖ్యాతంబన మిశ్రబంధమన నుత్పాద్యం బనంగాఁ ద్రిధా
వ్యాఖ్యాతంబగు వస్తువందు మఱి యధ్యాహారముం జేయఁగాఁ
బ్రఖ్యాతం బితివృత్తమైనఁ గృతిసెప్పన్ వక్తకున్ శ్రోతకున్
విఖ్యాతిఁ గలిగించుఁ బుణ్యమహిమన్ విశ్వంభరామండలిన్.

అన్న పద్యమువలనను దెలియుచున్నది. మనుచరిత్రము ఈ పినవీరభద్రుని 'శృంగార శాకుంతలమునకుఁ బిమ్మట సర్వోత్కృష్టముగా వెల్వడిన మహా ప్రబంధము'. కాలప్రభావమును బట్టి పెద్దనార్యుఁడును ప్రఖ్యాతకథనే గ్రహించి తన ప్రతిభా విశేషముచే కొలది మార్పులను, నుచితవర్ణనలను జేర్చి మనుచరిత్రమును మిశ్ర కథ గావించినాఁడు.

తన యపూర్వకవితాశక్తిచే భారతభాగవతములకుఁ బిమ్మట నే గ్రంథమునకును లేని రసిక ప్రజాదరణమును మనుచరిత్రకుఁ గల్పించి, 'ఆంధ్రకవితాపితామహ' బిరుదము నర్థవంతము గావించుకొని, యశఃకాయుఁడైనాఁడు.

మనుచరిత్ర కథ - మార్కండేయ పురాణాంతర్గతము

మనుచరిత్రలోని కథను పెద్దనార్యుఁడు మార్కండేయ పురాణమునుండి గ్రహించినాఁడు. ఈ మార్కండేయ పురాణమును తిక్కన మహాకవి శిష్యుఁడైన మారన క్రీ.శ. 1330 ప్రాంతమున నాంద్రీకరించినాఁడు. మారన యే కథ ననువదించినాఁడో పెద్దనయు నా కథనే యనువదించినాఁడు.

కథాసంగ్రహము

ప్రవరునింటికి ఔషధసిద్ధుని రాక

వరుణానదీతీరమున అరుణాస్పదమను పురమున విద్యాపారంగతుఁడు, ధనికుఁడు, శమదమాది గుణసంపత్తి గలవాఁడును, మకరాంక శశాంక మనోజ్ఞమూర్తియునైన ప్రవరుఁడను బ్రాహ్మణవంశ ప్రదీపకుఁడు వసించుచుండెను.


630

వావిలాల సోమయాజులు సాహిత్యం-4