Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనుచరిత్రంబందుకొను వేళఁ బుర మేఁగఁ
బల్లకిఁ దన కేలఁ బట్టియెత్తె
బిరుదైన కవిగండ పెండేరమున కీవె
తగుదని తాన పాదమునఁదొడిగె


తే. ఆంధ్రకవితా పితామహ అల్లసాని
పెద్దన కవీంద్రయని నన్నుఁ బిలచునట్టి
కృష్ణరాయలతో దివికేగలేక
బ్రదికియున్నాఁడ జీవచ్ఛవంబనగుచు.”

కావున పెద్దన కృష్ణరాయల నిర్యాణకాలమైన క్రీ.శ. 1530కి తరువాతఁ గొంతకాలము జీవించియుండవలెను. ఆ కాలమెంతో నిర్ణయించుట కష్టము. అది బహుశా ఐదు సంవత్సరములని యూహించినచో పెద్దన క్రీ.శ. 1535 ప్రాంతమున స్వర్గస్థుఁడు కావలయును. ఈ సందర్భములన్నింటిని లెక్కించి శ్రీ పింగళి, పెద్దనార్యుఁడు క్రీ.శ. 1470 ప్రాంతమున జన్మించి తన యేఁబదవ యేట మనుచరిత్రమును జెప్పి అరువది సంవత్సరాలకుఁ బైగా జీవించి, క్రీ.శ. 1535 ప్రాంతమున తరలిపోయియుండునని యూహించినారు. (తెలుగు భాషాసమితి - విజ్ఞాన సర్వస్వము. పే. 927)

మనుచరిత్ర : స్వారోచిషమనుసంభవము

'మనుచరిత్రం బందుకొనువేళఁ బురమేఁగఁ బల్లకిఁ దనకేల బట్టి యెత్తె' అను చాటువులో మను చరిత్రమనియును, 'కోరిక నీ స్వారోచిషు చారిత్రము వినిన వ్రాయ' (ఆ 6 ప 119) అనినచో స్వారోచిష చరిత్రయని, 'నా యొనర్పంబూనిన స్వారోచిష మనుసంభవంబను మహా ప్రబంధంబునకు కథాక్రమం బెట్టిదనిన' అనుచో స్వారోచిష మనుసంభవమని మూఁడు పేర్లను పెద్దనార్యుఁడే వాడియున్నాఁడు.

మనుచరిత్ర అతాశ్వాసముల ప్రబంధము. ఇందయిదాశ్వాసములలోను, ఆఱవయాశ్వాసమున నధికాంశమునందును స్వారోచిషమనువు సంభవమునకుఁ గారణభూతమైన చరిత్రయే యున్నది గాని యతని చరిత్రము లేదు. అతని చరిత్రమంతయును నాఱవయాశ్వాసమందలి తుదినున్న యిరువది యొక్క పద్యములలో నున్నది. ఈ కారణముచే దీనిని మనుచరిత్రమనుట కన్న మనుసంభవకారణమైన చరిత్రయగుటచే స్వారోచిష మనుసంభవమనుటయే యుచితమని విమర్శకుల యభిప్రాయము. (తేవప్పెరుమాళ్ళయ్య). పెద్దనయును నీ నామమునే ఆశ్వాసాంత


628

వావిలాల సోమయాజులు సాహిత్యం-4