Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"ఈ ఉద్యోగపర్వమంతయును వ్యంగ్యచమత్కృతులతోను, వానికి మించిన సమాధానములతోను నిండియున్నది. 'ధ్వనిరాత్మా కావ్యస్య' (కావ్యమున కాత్మధ్వని) అనెడి పూర్వాచార్యుల మతమునకు అద్వితీయమైన నిరూపణ మీ పర్వమునందున్నది. కథకుఁగాని మరి యే యితర కావ్యగుణమునకుఁ గాని యిందు ప్రాధాన్యము లేదు. నదులన్నియును సముద్రమునఁ గలిసినట్లు ఇతర గుణములన్నియును ధ్వనిలోనిముడుచున్నవి. దీనిని బఠించుచుండగా నీ నాఁటి యుద్ధ సన్నాహములు, ఈ నాఁటి కపట ప్రచారములు, ఈ నాఁటి యువన్యాన నైపుణ్యములు అన్నియు ప్రత్యక్షములగుచుండును. ఈ కారణముననే యీ పర్వము మన కామోదదాయకముగానున్నది." ఈ రీతిగ కావ్యము లోకమునకుఁ బ్రతిబింబముగ (Mirror of life) నుండవలయుననిగదా పాశ్చాత్య దృష్టి!

“ఉద్యోగపర్వమునందలి వస్తునిర్వహణ కౌశలము అనన్యసాధ్యము.మొదటినుండియు తుదివఱకును, స్వల్పంశములను అప్రధానవస్తువులను గూడ నెంతో హృద్యమొనర్చుచు నిర్వహించిన వస్తుచిత్రణ మిందలి కళావైభవమునకు సంజీవని. ఇంకను నిట్టి మహాగుణములు మూఁడు నాలుగైన నిందు బ్రత్యక్షమగుచున్నవి. ముఖ్యముగఁ బేర్కొనఁదగినవి వ్యక్తిచిత్రణము, శైలియును. 'ఈ పర్వమునందలి అపురూప లావణ్యమును పూర్ణముగ విపులీకరించుకొని చూచినచోనిది ఆంధ్రవాఙ్మయమున కోటి కోహినూరుల కాంతితోఁ బ్రకాశించుచున్నట్లు స్పష్టమగుచున్నది. ఈ పర్వము నందలి శిల్పవైభవము నాధారముగాఁగొని విశ్వకళాప్రపంచమున నాంధ్రుడు జైత్రయాత్రకు ప్రస్థాన (యుద్ధయాత్ర) భేరిని మాత్రమే గాక జయదుందుభిని గూడ మ్రోగింపవచ్చును." (శ్రీ నండూరి బంగారయ్య)


623

సాహిత్య విమర్శ