ఇవిగాక యిందు ప్రథమాశ్వాసమున పురందర విజయోపాఖ్యానము, చతుర్థాశ్వాసమున అంబోపాఖ్యానము, మహాకవి అనునవి ప్రాసంగికేతి వృత్తములు. తిక్కన మహాకవి వీనిని, కేవలము నీతిబోధ తత్త్వ బోధలతోఁ గూడిన ప్రజాదరణవృత్తాంతమును సంగ్రహించినాఁడు. కావున నివి ప్రస్తుత కథ కుపకరించు నట్టివిగానే యున్నవిగాని కథాగమనము (Progress of the story) నడ్డునట్టివిగా లేవు.
వ్యాసభారతమున గుహ్యమైన యోగశాస్త్రము వస్తువుగాఁగల సనత్సుజాతీయమున్నది. తిక్కన దీని నించుమించుగ ఉన్నదా యను సందేహము కలుగునంతగా సంగ్రహించినాఁడు. ఈ కారణమున కొందఱు తిక్కనను మహాపరాధిగా భావించుచున్నారు. తిక్కన దీనిని గుహ్యమైన (రహస్యమైన) విద్యయని విడిచి పెట్టియుండఁడు. ఇది శాస్త్ర గ్రంథమగుటచే కావ్య రసదృష్టితోఁ దిక్కన దీనిని అనువదించుట మానియుండును.
సనత్సుజాతీయము, భగవద్గీత, ఉత్తరగీత, ఇత్యాదులు ప్రత్యేకముగ ఉత్తమ గ్రంథములు. కాని తిక్కన కేవలము 'వేదభారవాహి' (వేదముల యొక్క భారమును మ్రోయువాఁడు) కానందున వీనిలోని శాస్త్ర భాగములను జీర్ణించుకొని, తరువాతి శాంతి పర్వాదులందు భీష్మ ధర్మజాదుల సంభాషణ లందు వీనిలోని యంశములను క్రోడీకరించినాఁడు. ఈ యుద్యోగపర్వ ద్వితీయాశ్వాసమున నొక ప్రాతఃకాల వర్ణనమున్నది. ఇది మధ్యకాలీన సంస్కృతకవుల వర్ణనలను బోలియున్నది. ఒకవేళ నీ వర్ణనమును విడిచి పుచ్చినను, నీ కావ్య సౌందర్యమునకు లోపము కల్గియుండెడిది కాదని విమర్శకాభిప్రాయము.
ఉద్యోగపర్వమునందు 1. ద్రుపద పురోహితుని రాయబారము 2. సంజయుని రాయబారము 3. శ్రీకృష్ణుని రాయబారము - అను మూఁడు రాయబారములున్నవి. ఇందు ప్రధానములైనవి సంజయుని రాయబారము, శ్రీకృష్ణుని రాయబారములు. మహాభారత యుద్ధనాటకమునకు శ్రీకృష్ణుని రాయబారము నాంది. శ్రీకృష్ణుని రాయబారమునకు సంజయుని రాయబారము నాంది. సంజయుని రాయబారమునకు ద్రుపదపతి పురోహితుని రాయబారము నాంది. విప్రుని రాయబారమున పారుష్యము, సంజయుని రాయబారమున చాతుర్యము, శ్రీకృష్ణుని రాయబారమున ఔజ్జ్వల్యము ప్రధానలక్షణములై కన్పట్టుచున్నవి.
622
వావిలాల సోమయాజులు సాహిత్యం-4