ప్రతిబంధకము కాదా యని ప్రశ్నింపవచ్చును. యుద్ధయత్నములు సంధి పొసఁగుటకు ప్రతిబంధకము కావని నా సమాధానము. పైగా యుద్ధప్రయత్నములే సంధికిఁ దోడ్పడునని చెప్పవచ్చును. శత్రువు బలవంతుఁడుగ నున్నప్పుడు సంధి పొసఁగనిచో యుద్ధము సంభవించి అపజయము కలుగునేమోయని సందేహము కలిగి సంధి జరుగుట కెక్కువ యవకాశమిచ్చును'. దీనినిబట్టి ఉద్యోగమునకు సంధి ప్రయత్నమనియే యర్ధము చెప్పవలయునన్నమాట!
కొంద రీ యభిప్రాయముతో నేకీభవింపక ఈ పర్వమందుఁ జరిగిన సర్వమును యుద్ధప్రయత్నముగానే సమన్వయించుచున్నారు. 'ఇందు జరిగిన సంధి ప్రయత్నము లందు నిజముగా విశ్వాసమున్నవారు అల్పసంఖ్యాకులు. ఒక్క ధర్మజుఁడు తప్ప నిజముగా సంధి జరుగునని విశ్వసించినవారు ఎవ్వరు నున్నట్లు కన్పట్టరు. అతనికైన నీ విశ్వాసము దృఢముగ నున్నదో లేదో చెప్పఁజాలము. అదియునుగాక యిందు జరిగిన సంధి యత్నము లన్నియును నుభయ పక్షములును తమపక్షమున లోపమేమియును లేదనియును, తప్పంతయు నెదుటి పక్షము వారిదేనని నిరూపించుటకు, దాని మూలమున జనాభిప్రాయమును జూరఁగొనుటకును జరిగించినవే. ఇట సంధి ప్రయత్నముల విస్తృతి యధికముగా నున్నను ప్రాధాన్యమంతయును సమర ప్రయత్నములయందే. సంధి ప్రయత్నములు గూడ సమర ప్రయత్నములకు బలము చేకూర్చుటకు జరిగినవేయగుటచే నీ పర్వమును సమరోద్యోగపర్వముగనే భావించుట యుక్తము.' (శ్రీ నండూరి బంగారయ్య). దీర్ఘముగ నాలోచించినచో నీ యర్థమే సమంజసముగఁ గన్పట్టుచున్నది.
కథావస్తువు
ఉద్యోగపర్వమున వస్తువిషయకముగ విశేష ప్రాముఖ్యము గలవి సంజయుని రాయబారము, శ్రీకృష్ణుని రాయబారము. ప్రథమాశ్వాసమున ప. 258 మొదలు ఆ ఆశ్వాసము తుదివఱకును; పిమ్మట ద్వితీయాశ్వాసమంతయును సంజయుని రాయబారము.
తదనంతర కథ తృతీయాశ్వాసము, చతుర్థాశ్వాసమున ప. 93 వఱకును కృష్ణుని రాయబారము నున్నవి. ఇవిగాక విరాటరాజు కొలువున జరిగిన సంప్రదింపులు, ద్రుపద పురోహితుని రాయబారము, చతుర్థాశ్వాసమందలి సేనానాయక నిర్ణయము, ఉభయపక్ష బలాబల నిరూపణములకు సంబంధించిన ప్రసంగములు ఈ ఉద్యోగపర్వమున ప్రధాన కథావస్తువునకు సంబంధించిన యంశములు.
సాహిత్య విమర్శ
621