శిఖామణివలె గోచరించును. మంత్రియై రాజ్యభారమును నిర్వహించిన యా కాలము నాఁటి తన యనుభవము నంతటినీ స్మృతికిఁ దెచ్చుకొని ఈ ఘట్టములందు ఒకదానిని పోలని రీతిగా మఱియొక దానిని జూపించుచు మూఁడు రాయబారములను - ద్రుపద పురోహిత, సంజయ, శ్రీకృష్ణుని రాయబారములను రాజనీతి కోవిదుఁడై అనన్య సాధ్యములనునట్లు నడిపినాఁడు. ఉద్యోగ పర్వము నాంద్రీకరించుటకు తిక్కనార్యునివలె యోగ్యత గల కవిశేఖరుఁడు ఆంధ్రభూమిని జన్మింపలేదని విమర్శకాభిప్రాయము. ఆంధ్రసాహిత్యమున జన్మించిన ఆయా కవుల జీవిత విశేషములను పరికించి చూచినచో నీ విషయమెంతయు సత్యమని నిరూపితమగును.
ఉద్యోగపర్వ నామము
ద్రుపదపతి పురోహిత, సంజయ, శ్రీకృష్ణ రాయబారములతో గూడిన యీ కథావస్తువుతో నొప్పు భారత గ్రంథ భాగమునకు 'ఉద్యోగ పర్వ' మని పేరు. 'ఉద్యోగ' శబ్దమునకు 'ప్రయత్న' మని యర్ధము. ఈ ప్రయత్నము దేని నిమిత్తము? సంధి నిమిత్తము. ఈ రాయబారము లారంభమగుటకుఁ బూర్వమే కౌరవ పాండవులు ఉభయులు యుద్ధయత్నము లొనర్చినారు. భారతదేశమందలి రాజులందరును నీ రెండు పక్షములలో నేదో యొక దానియందు జేరిపోయినారు. కౌరవులు పదునొకండక్షౌహిణుల సైన్యమును, పాండవులు ఏడక్షౌహిణుల సైన్యమును కూర్చుకొనినారు. కాని ఉభయపక్షముల వారును సంధియత్నము లొనర్చినారు. పాండవులు ద్రుపదపతి పురోహితుని కౌరవుల కడకంపి సంధియత్నమొనర్చినారు. ధృతరాష్ట్రుఁడు తనయాంతరంగికుఁడైన సంజయుని పాండవులున్న ఉపప్లావ్యమున కంపి సంధియత్న మొనర్చినాఁడు. సంజయుని రాయబారము వలనఁ నేమియును దేలక పోవుట వలన, శ్రీకృష్ణుఁడు పాండవపక్షమున హస్తిన కేగి కౌరవులతో సంధియత్నమొనర్చినాఁడు. ఈ కారణములచే నిందలి 'ఉద్యోగము' (యత్నము) అంతయును సంధికొఱకేయైనట్లు కన్పట్టుచున్నది. కావున దీనికి కథావస్తువులోని సంధియత్నములనుబట్టియే ఉద్యోగపర్వమను పేరు వచ్చినదనవలయును.
అయిన మరి యుద్ధయత్నములు సంధికి సహాయకారులా? అన్న ప్రశ్న ముదయించుచున్నది. దానికి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ ఇట్టి సరసమైన సమాధానమును జెప్పినారు. "లోకచరిత్రలో యుద్ధములు రాయబారములు జరిగినపుడెల్లను రెంటి నిమిత్తము ప్రయత్నములు ఏకకాలముననే జరుగుచుండును. రాయబారములు జరుపుచు యుద్ధయత్నములు చేయుట సంధి పొసఁగుటకు
620
వావిలాల సోమయాజులు సాహిత్యం-4