Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గృతినీయఁదలచినవాఁడు గావున నన్నయ విడిచిపుచ్చిన ఆరణ్యపర్వశేషము నెత్తుకొనకవిరాటముతోఁగథనారంభించినాఁడు. ప్రతి కథాఘట్టము నొక 'ప్రబంధమను దృష్టితో తిలకించి రచించు తిక్కన "ఈ ప్రబంధమండలికి" తన హృదయాధినాథుఁడైన హరిహరనాథుని అధినాథుని గావించినాఁడు.

తిక్కన జెప్పిన పదునైదు పర్వములలో విరాటపర్వము మొదటిది. ఇది 'ఊర్జిత కథోపేతము. నానా రసాభ్యుదయోల్లాసి' ఉద్యోగము తఱువాతిది. విరాటోద్యోగ పర్వములు రెండును ప్రావృట్కాలమున (వర్షాకాలమున) నుభయకూలముల (రెండు ఒండ్లను) దరిసి యుప్పొంగిపారు మహానదీప్రవాహములవలె నడచిన యద్వితీయ భాగములు.

తిక్కన కవితాప్రౌఢికి, ప్రతిభానిరూఢికిఁ దగినట్లు విరాటపర్వమునఁ గథావస్తువు పుష్టమై సమకూడినది. కేవలము శ్రవ్యకావ్యలక్షణములే కాక దృశ్య కావ్య లక్షణములను గూడ మేళవించి, అనుపమాన రసాస్పదముగ కవిబ్రహ్మ యిందు కవిత సాగించినాఁడు. 'విరాటపర్వము తిక్కశర్మ కవితాసౌష్ఠవమునకు నిలువుటద్దమువంటిది. భారతగ్రంథ హర్మ్యరాజమునం (పెద్ద మేడ) దెత్తిన మాణిక్యదీపము.' (శ్రీ రాజశేఖర శతావధాని).

ఉద్యోగపర్వము - విశిష్టత

ఉద్యోగపర్వమునకు శ్రీకృష్ణరాయబారఘట్టము వజ్రకిరీటము. దీనిని తిక్కనార్యుఁడు అపూర్వమైన తన కవితాప్రతిభతో లోకోత్తరముగ నడిపినాఁడు. ఇందలి కథావస్తువునకును, విరాటపర్వమందలి కథావస్తువునకును సహజముగ విశేష విభేదమున్నది. విరాటమందలి కథ నానారీతులైన వస్తు సన్నివేశములు గలది. నానారసములతో నొప్పిన కథాఘట్టము లిందున్నవి. ఉద్యోగపర్వమున నట్టి రసవపట్టము గాని, కథారుచులుగాని లేవు. ఇందలి కథయంతయు రెండు మూఁడు ముక్కలలోఁ చెప్పదగినది. తిక్కన దీనిని తన పాత్రోచితసంభాషణ మూలమున నొక రసవత్ప్రబంధముగఁ తీర్చి దిద్దఁగలిగినాఁడు. ఈ విషయమును గమనించియే శ్రీ నండూరి బంగారయ్య 'ఉద్యోగమందున్న చమత్కృతియంతయును బ్రసంగా శ్రయమే' యని అభిప్రాయమిచ్చినారు. తిక్కన విరాటపర్వమున నొక విశాల ఫలకముపై వివిధ శిల్పకక్ష్యలు కన్పట్టునట్లు నానా కథాసందర్భములను బహువిధ రసస్ఫూర్తులతో నొప్పునట్లు శిల్పించి, చూచువారికి రసపారణ మొనర్చు మహాశిల్పివలె గన్పట్టును. ఉద్యోగమున నట్లుగాక తిక్కన మన్మక్షితీశుని రాజ్యచక్రమును ద్రిప్పిన మంత్రి


సాహిత్య విమర్శ

619