ప్రౌఢమగు వయసునఁజెప్పిన యీ రామాయణమునందు తిక్కన రాజసము, అహంకారము, గోచరించును. “అమలోదాత్తమనీష నేనుభయ కావ్య ప్రౌఢిపాటించు శిల్పమునన్ పారగుఁడన్ కళావిదుఁడ" నని చెప్పిన పద్య మిందుకుఁ జక్కనియుదాహరణము. ఈ కావ్యమును రచించిన కాలమునకును భారతమును జెప్పిన కాలమునకును మధ్యగల కాలములో తిక్కన మహాకవి మనసునందు విశేష పరిణామము కల్గినది. ఆయన పూర్వము మంత్రి. రాజుల యనురాగ వీక్షణము నర్థించువాఁడు. భారత రచనాకాలమున బుద్ధి పక్వమైనది. యజ్ఞ మొనర్చినాఁడు. నేడు తిక్కన యర్థించునది తన యిష్టదైవమైన హరిహరనాథుని అపాంగ వీక్షణము మాత్రమే. రామాయణము నాఁటి గర్వాహంకారములు తొలఁగినవి. భారత కృత్యాదిని వినయసంపద తోప “నా నేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడనయ్యెద భక్త కోటికిన్” అని చెప్పుకొనినాఁడు. నిర్వచనోత్తర రామాయణము నందును కొంత తిక్కనార్యుని ప్రౌఢకవిత గోచరించును. అయినను'నిర్వచనోత్తరరామాయణము తిక్కనకు విలువ రాయి కాదు' (కవిత్వవేది).
కవిత్రయములో నొకఁడైన ఎఱ్ఱన తిక్కన రచనను గూర్చి 'తన కావించిన సృష్టి తక్కొరుని చేతంగాదు నా నే ముఖంబునఁ దాఁబల్కిన పల్కులాగమములై పొల్పొంద చెప్పినాఁ'డని స్తుతించినాఁడు. ఇట్టి స్తుతియంతయును తిక్కన మహాకవికి భారత రచన వలనఁ జేకూరినది. 'వినిన భారతమునే వినవలయును తినిన గారెలే తినవలయును' అని యొక సూక్తి. ఈ సూక్తి తెలుగు భారతమునకే వర్తించును. అదియును తిక్కన రచనవలననే భారతమునకుఁ జేకూరినది. ఇట్టి గౌరవము భారతమునకుఁ గలుగుటకు తిక్కనకు 'ఆంధ్రావళి మోదముం బొరయునట్లుగా' రచన యొనర్పవలయునను మహోత్సాహము కల్గుటయే కారణము. ఆంధ్రభారత రచన మూలమున తిక్కన ఆంధ్రభాషకు, జాతికి మహోపకారమొనర్చి 'ప్రాతఃస్మరణీయుఁ' డైనాఁడు.
విరాటోద్యోగ పర్వములు
తిక్కన భారతమున విరాటపర్వము మొదలు పదునైదు పర్వములు జనాభ్యర్చితమైన కవితలోఁ జెప్పినాఁడు. భారతరచన మొనర్చునపుడు తిక్కన తన చిత్తమును 'సాత్యవతేయ సంస్కృతి శ్రీవిభవాస్పదమును గావించుకొనినాఁడు. ' నిత్యము నిష్టదైవమైన హరహరనాథుని ప్రత్యక్షీకరించుకొని యా దేవదేవుని హృదయమున కెక్కునట్లు జెప్పినాఁడు. 'భక్త కోటికి వరణీయుఁ డైనాఁడు. హరిహరనాథునకుఁ
618
వావిలాల సోమయాజులు సాహిత్యం-4