మార్గమును జూపినాఁడు. శైవవైష్ణవాభిమానములతో కల్లోలితమైన మతరంగమున హరిహరనాథ తత్త్వమును ప్రబోధించి సమన్వయ మార్గమును సూచించినాఁడు. సాహిత్యరంగమున 'శివకవి' 'భవి కవి' (శైవులు కాని కవులు) మార్గముల రెంటిలోని మంచిని గ్రహించి కవితావ్యవసాయమును సాగించు పద్ధతిని ప్రదర్శించినాఁడు. ఈ రీతిగ సర్వరంగములలోను సమన్వయమార్గమును బ్రదర్శించిన తిక్కన ఆ నాఁటి ఆంధ్రజాతికి గురుమూర్తి.
"తిక్కన యసాధారణ పురుషపుంగవుడని యాతని గుణములు స్థిరపరచుచున్నవి. అతని జీవితము నాఁటి సాంఘిక స్థితిలోని ఔన్నత్యమాతనికి సంక్రమించినది. అప్పటి శృంగారములోని పవిత్రత యాతనియందు ప్రతిఫలించినది. ప్రథమ ప్రతాపరుద్రుని శౌర్యము, గణపతిదేవుని రాజనీతి, విశ్వేశ్వర శివదేశికుని యాధ్యాత్మిక సంపద, తన వంశములోని ఖడ్గతిక్కన సాహసము, తన తాతలోని కవితారమణీయము కవి తిక్కనలోఁ గలసినవి. పూచినవి. భారతాంధ్రీకరణమున ఫలించినవి (శ్రీ కవిత్వవేది)
“ఆంధ్ర భాషాసతిని స్వస్వరూపమున నిలిపి యుద్ధరించినవారిలో నీతఁ (తిక్కన) డగ్రగణ్యుఁడని చెప్పవలసి యున్నది. ఈతనిమూలమున నాంధ్రవాఙ్మయము, ఆంధ్రభాష, ఆంధ్ర దేశము, ఆంధ్రజాతి, వేయేల ఆంధ్రత్వమనునదే ధన్యత్వము నొందుచున్నది." (శ్రీ కోరాడ ).
తిక్కన కృతులు
తిక్కన తన కాలమునాఁడు సాహితీ గురుపీఠ మలంకరించి తన గృహమునే సాహితీ సంస్థగా నొనర్చి సమకాలిక కవులను బ్రబోధించుటయే గాక, తన ఆచార్యత్వమును స్థాపించు కొనుటకై కావ్యరచనకు గడంగినాఁడు. అప్పటికి రంగనాథ రామాయణ మారుకాండలేయైనది. ఏడవదియైన ఉత్తరకాండ రచింపఁబడకపోయినచో రామాయణ మసంపూర్ణముగ నుండిపోవును. కావున నిర్వచనోత్తర రామాయణమును రచించి యా యుద్ధంథమునకుఁ బరిపూర్తిని గల్పించినాఁడు. ఇంతకుఁబూర్వమే తన నవయౌవనమాధుర్యము ద్యోతకమగునట్టి విక్రమసేనమను ప్రౌఢశృంగార కావ్యమును జెప్పినాఁడు. నిర్వచనోత్తర రామాయణమునకు బూర్వమే చెప్పిన కవివాగ్బంధము లక్షణగ్రంథము కానోపును. తన నిర్వచనోత్తర రామాయణమును కృతిపతియైన మనుమసిద్ధి "ఏ నిన్ను మామ యనియెడు దానికిఁ, దగనిమ్ము భారతీకన్యక" యని అర్థించి యంకితముగొన్నట్లు కృత్యాదిని చెప్పుకొనినాఁడు.
సాహిత్య విమర్శ
617